Thimmapur | తిమ్మాపూర్, మార్చి 9 : తమకున్న భూమిని నమ్మి బిడ్డకు రాసిస్తే బువ్వ పెట్టలేని దుస్థితి నెలకొంది. ఈ ఘటన తిమ్మాపూర్ మండలంలోని రామకృష్ణకాలనీలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణకాలనీ గ్రామానికి చెందిన మచ్చిగాని అలియాస్ అలువాల ఎల్లవ్వ, మల్లయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. మల్లయ్య మరణించారు. ఎల్లవ్వ పోషణ ఇదే గ్రామంలో ఉంటున్న ఒక కూతురు చూసుకుంటానని, ఎల్లవ్వ దంపతులకు ఉన్న రెండు గుంటల భూమి రాయించుకుంది.
ప్రస్తుతం ఎల్లవ్వను నిర్లక్షం చేయడంతో చీమలకుంటపల్లి లోని మరో కూతురు వద్ద ఉంటున్నది. అయితే తననను పోషిస్తనంటేనే భూమి ఇచ్చానని, ఇప్పుడు తనకు బువ్వ పెట్టడం లేదని, ఆ భూమిని తనకు తిరిగి ఇవ్వాలని ఎల్లవ్వ సోమవారం ఎల్ఎండీ ఠాణా మెట్లెక్కారు. నడవలేని స్థితిలో ఉన్న ఎల్లవ్వ వద్దకు ఎస్సై సయ్యద్ అన్వర్ రాగా ఎల్లవ్వ రోదిస్తూ తన బాధ చెప్పుకుంది. న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తహశీల్దార్ వద్దకు కూడా వెళ్ళి అర్జీ పెట్టుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ స్టూలు పట్టుకొని వంగి ఈడ్చుకుంటూ వెళ్తున్న ఎల్లవ్వ ను చూసి స్టేషన్కు వచ్చినవారు అయ్యో అవ్వా ఐదుగురు బిడ్డలుండి బుక్కెడు బువ్వకు తప్పలైతంద అంటూ విచారం వ్యక్తం చేశారు.