Blacklisted | కోల్ సిటీ, డిసెంబర్ 3 : రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల విషయంలో నిర్లక్ష్యం వహించినా, నాణ్యత ప్రమాణాలు పాటించకపోయినా, సకాలంలో పనులు ప్రారంభించకపోయినా సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి ఆపై బ్లాక్ లిస్టులో చేర్చాల్సి వస్తుందని అదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ (ఎఫ్ఎసీ) జే.అరుణ శ్రీ కాంట్రాక్టర్లకు అల్టిమేటం చేశారు. ఈ మేరకు నగర పాలక కార్యాలయంలోని ఆమె చాంబర్లో బుధవారం సాయంత్రం మున్సిపల్ కాంట్రాక్టర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
టెండర్ పొందిన పనులన్నీ సకాలంలో పూర్తి చేయాలన్నారు. పనులు చేయడంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే అనవసర కాలయాపన చేయకుండా సత్వర పరిష్కారం కోసం తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. నిర్దేశిత గడువులోగా పనులు ప్రారంభించని పక్షంలో సదరు కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేస్తామనీ, అప్పటికీ నిర్లక్ష్యం వీడకపోతే బ్లాక్ లిస్టులో పెట్టడం ఖాయమన్నారు.
అలాగే ఇంజనీరింగ్ అధికారులు సైతం క్షేత్ర స్థాయిలో పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తారనీ, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదనీ, ఎక్కడైనా కాంట్రాక్టర్లు నాసిరకం పనులు చేపట్టినట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ రామన్, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తో పాటు పలువురు మున్సిపల్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.