TBGKS | గోదావరిఖని : సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాకులను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కాపాడడానికేనని ఆయన ఆరోపించారు. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణం పైన, డీజిల్, పేలుడు పదార్థాల కొనుగోలు, ఓవర్ బర్దన్ తొలగింపు టెండర్లలో అవినీతి, సోలార్ ప్లాంట్ ఏర్పాటులో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వల పైన సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ విచారణ జరపాలని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు.
దొంగకే తాళం చేతులు ఇవ్వడం, సింగరేణి విచారణ జరపడం రెండు ఒకటేనన్నారు. కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్న విధంగా రూ.12,500 విలువైన బట్టలు సింగరేణిలో ఇప్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. సింగరేణి సమీక్షా సమావేశం సందర్భంగా బీజేపీ, బీఎంఎస్ నాయకులతో వినతి పత్రాలు తీసుకొని చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. గోలేటి, మాదారం, కేకే ఓసీ మందమర్రి, జేకే-5 విస్తరణ ఇల్లందు, మణుగూరు ఓపెన్ కాస్ట్ గనుల అనుమతులను ఇప్పించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావలసిన రూ.58 వేలకోట్ల బకాయిలను తక్షణమే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఉండాలని ఏర్పాటుచేసిన నిబంధన వలన సంస్థకు జరుగుతున్న నష్టం పై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ నేతలతో కలిసి నడుస్తున్న బీఎంఎస్, ఇతర కార్మిక సంఘాలను రాజకీయ జోక్యం అంటూ విమర్శించడం సిగ్గుచేటు అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి, సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమురయ్య, అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జాహిద్ పాషా, నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఐ సత్యం, ఏ గోపి, అక్తార్ పాషా, రోడ్డ సంపత్, పులిపాక శంకర్, వీ గౌడ్, రాజ్ కుమార్ చారి, గుమ్మడి సుందర్ తదితరులు పాల్గొన్నారు.