Boynapalli Vidhodkumar | కమాన్ చౌరస్తా, జనవరి 2 : ప్రతీ ఒక్కరికి చదువు విషయంలో క్రమశిక్షణ, సహనం, సాధించగలనన్న నమ్మకం ఉండాలని, అప్పుడే ఏదైనా సాధించవచ్చని మాజీ పార్లమెంట్ సభ్యుడు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారధి స్టడీ సర్కిల్‌ను ప్రతిమ మల్లీఫ్లెక్స్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేశారు. ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి, డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్‌లతో కలిసి ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గత తెలంగాణ ప్రభుత్వంలో వరుస నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల సౌకర్యార్థం ఈ స్టడి సర్కిల్‌ను 2018 జనవరిలో ఏర్పాటు చేశామన్నారు. అప్పటి నుంచి ఎంతో మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలకు ఎంపికయ్యారని చెప్పారు.
అయితే గతంలో కృషి భవన్లో స్టడీ సెంటర్ కొనసాగగా, ప్రస్తుతం విద్యార్థుల సౌకర్యార్థం ప్రతిమ మల్టీఫ్లెక్స్‌లోని రెండో ఫ్లోర్లో ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దీని నిర్వహణ మొత్తం ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులే చూస్తున్నారన్నారు. ఇప్పటికే దీని ద్వారా దాదాపు 300 మంది వరకు ఉద్యోగాలు సాధించడం సంతోషంగా ఉన్నదన్నారు. రాజకీయలలోకి ఈ స్టడీ సిర్కిల్ను ఎప్పుడూ రానివ్వలేదని, ఇది రాజకీయాలకు దూరంగా ఒక సామాజిక బాధ్యతగా చేసే కార్యక్రమం అని వివరించారు. అలాగే, రానున్న రోజుల్లో బ్యాంకింగ్ ప్రరీక్షలకు ప్రిపర్ అవుతున్న విద్యార్థుల కోసం ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు ప్రతిమ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ హరిణి మాట్లాడుతూ ప్రతిమ ఫౌండేషన్ ఉద్యోగార్థులకు అవసరైనమైన సౌకర్యాలు కల్పించడానికి ముందుంటున్నదారు. ఈ స్టడీ సర్కిల్‌ను ఉపయోగించుకుని ఉద్యోగాలు సాధించగలగడం గొప్ప విషయమని, ఇలాంటి కార్యక్రమాల్లో తమను ప్రోత్సహిస్తున్న వినోద్‌కుమార్‌కు కృజ్ఞతలు తెలిపారు. డైరెక్టర్ డాక్టర్ ప్రతీక్ మాట్లాడుతూ, ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా, స్టడీ సర్కిల్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి కార్యక్రమాల ఏర్పాటులో తమ కుంటుంబం నుంచి తన సోదరి డాక్టర్ హరిణి సహకారం గొప్పదని చెప్పారు. అనంతరం స్టడీ సర్కల్‌లో చదివి ఉద్యోగాలు సాధించిన పలువురు అభ్యర్థులను ప్రతిమ ఫౌండేషన్ నిర్వాహకులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జక్కుల నాగరాజు యాదవ్, సాయికృష్ణ, విజయేందర్ రెడ్డి, శ్రీనాథ్ గౌడ్, వంశీ, ఓంకార్, అఖిల్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.