రాంనగర్ ఆగస్టు 24 : అపరిచిత వ్యక్తులతో అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి బెదిరింపులకి భయపడవద్దని కరీంనగర్ కమిషనరేట్ షీ టీం పోలీసులు సూచించారు. ఏదైనా ఆపద వచ్చినప్పుడు పోలీస్లను సంప్రదించాలని, షీ టీం నంబర్ 8712670759 ఫోన్ చేయాలని, ఈ సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని భరోసానిచ్చారు.
ఎవరైనా ధైర్యంగా ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని చెప్పారు. షీ టీం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ శ్రీలత ఆధ్వర్యంలో శనివారం అలుగునూర్ జడ్పీ పాఠశాలలో మహిళలు, యువతులు, విద్యార్థినులపై జరిగే నేరాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్ఐ విజయమణి మాట్లాడారు.
విద్యార్థినులకు సోషల్ మీడియా వినియోగం, గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఇంటర్నెట్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఇంకా డయల్ 100, 1098 యొక ప్రాముఖ్యతతోపాటు ఆపతర సమయంలో ఉమెన్స్ సేఫ్టీవింగ్ వారు రూపొందించిన టీ సేఫ్ ఎలా ఉపయోగపడుతుందో తెలిపారు.