Revenue department | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 6 : రెవెన్యూ శాఖలోకి పునరాగమనం అవుతామనే ధీమాతో ఉన్న, జిల్లాలోని పలువురు పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోల ఆశలు ఆడియాశలు కాబోతున్నాయి. డిగ్రీ ఉన్నవారిని మాత్రమే రెవెన్యూశాఖ లోకి రీ ఎంట్రీ అయ్యేందుకు అనుమతిస్తామని, మిగతా వారికి అర్హత పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
దీంతో, మాతృశాఖలోకి తిరిగి వెళ్లేందుకు దరఖాస్తులు చేసుకున్న జిల్లాలోని పూర్వ వీఆర్ఏలు, వీఆర్వోల్లో ఆందోళన నెలకొనగా, ధరఖాస్తుదారులంతా పునరాలోచన చేస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని కొంతమంది రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. భూమాత అమల్లో భాగంగా రెవెన్యూ శాఖలో ప్రతీ గ్రామాణికో గ్రామ పాలన అధికారిని నియమించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా గతంలో రెవెన్యూశాఖ లో పనిచేసి, ప్రస్తుతం ఇతర శాఖల్లోకి బదలాయించబడ్డ వీఆర్వో, వీఆర్ఏ లకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఔత్సాహికులు ధరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రభుత్వం సూచించింది.
దీంతో, ఇతర శాఖల్లో పెరిగిన కేడర్ విధులు నిర్వహిస్తున్న వారిలో కొందరు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో డిగ్రీ ఉన్న వారు తక్కువ సంఖ్యలోనే ఉండగా, అంతకన్న తక్కువ విద్యార్హతలున్నవారే అధికంగా ఉన్నారు. ఈ క్రమంలో ఇంటర్మీడియట్ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి తీసుకుంటామని, అలాగే, ఇతర శాఖల్లో నియామకం పొందిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చంటూ ఇటీవలే ప్రకటించింది. దీంతో, పాతవారికి ప్రాధాన్యత తగ్గించినట్లేనని స్పష్టమవుతుండగా, తమకు ఆశ కల్పించి అవకాశాలు దూరం చేస్తుండడం పట్ల పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
రెవెన్యూ శాఖలో తిరిగి వచ్చేందుకు జిల్లాలో 256 మంది పూర్వ వీఆర్ఓ, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 114 మంది మాత్రమే డిగ్రీ అర్హత కలిగిన వారు ఉన్నారు. వీరికి మాత్రమే నేరుగా వచ్చే అవకాశముండగా, మరో 64 మంది ఇంటర్ అర్హత కలిగి ఉన్నారు. వీరు మాత్రం ఇతరుల మాదిరిగానే అర్హత పరీక్ష తప్పనిసరి రాయాల్సి ఉంటుంది. ఇందులో ఎంపిక అయితేనే పూర్వ శాఖలోకి తిరిగి వెళ్లే అవకాశముంటుంది. దరఖాస్తు చేసుకునే ముందు ఎలాంటి షరతులు పెట్టని ప్రభుత్వం, నియామకాలకు గడువు సమీపిస్తున్న కొద్ది కొత్త కొత్త నిబంధనలు అమలు చేస్తుండటంతో, వారిలో తీవ్ర అసంతృప్తి పెల్లుబికుతోంది.
అలాగే వీరికి సర్వీస్ రూల్స్ కూడా అమలు చేయడంపై ఎలాంటి నిర్దిష్ట ప్రకటన ఇంకా వెలువరించలేదు. దీంతో పాత ఉద్యోగంలోకి తిరిగి వెళ్లటమా, లేక రెగ్యులరైజ్ అయి ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగంలోనే కొనసాగటమా..? అనే సందిగ్ధంలో రెవెన్యూలోకి తిరిగి వచ్చేందుకు దరఖాస్తులు చేసుకున్న పూర్వ వీఆర్ఏ, వీఆర్వోలు కొట్టుమిట్టాడుతున్నారు. భూమాత అమలులో కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వ నేతలు ముందుగానే ప్రభుత్వ నేతలు ముందుగానే వెల్లడిస్తుండటంతో, శాంతంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న వారంతా మానసిక ఆందోళనను కొనితెచ్చుకోవడం ఎందుకని రెవెన్యూ రియంట్రి దరఖాస్తులపై పునరాలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.