తిమ్మాపూర్, డిసెంబర్ 22 : తాము బలపరిచిన అభ్యర్థులు సర్పంచులైన తర్వాత మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తన సర్పంచులే గెలిచారు అంటూ చెప్పుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల్లో బీఆర్ఎస్ సత్తా ఏంటో తెలిసిందని హర్షం వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్లు అధికారంలో లేకపోయినా తమకు సముచిత స్థానాలు దక్కడం సంతోషకరమన్నారు. తిమ్మాపూర్లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా మెజారిటీ సర్పంచులు తమ పార్టీ బలపరిచిన వారేనని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే వెళ్లి ప్రచారం చేసిన చోట గెలవలేదని ఎద్దేవా చేశారు. ఆయన ఉంటున్న క్యాంప్ ఆఫీస్ ఉన్న గ్రామం మహాత్మానగర్, ఆయన సొంత గ్రామం పచ్చునూరులోనూ గులాబీ రెపరెపలాడిందన్నారు. కొత్తగా ఏర్పాటైన పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, గ్రామాలు అభివృద్ధికి దూరమై, ప్రజలు ప్రభుత్వంపై తిరగబడే సమయంలో ఎన్నికలు జరిగాయన్నారు. పార్టీలకతీతంగా జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని డబ్బులు పంపినా నియోజకవర్గంలో అత్యధికంగా బీఆర్ఎస్ సభ్యులు గెలిచారని స్పష్టం చేశారు.
ప్రశ్నించే గొంతుకలకు ప్రజలు పట్టంగట్టి, మరింత బాధ్యతను పెట్టారని చెప్పారు. ఇంతగొప్ప గెలుపును అందించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరని, రెండేళ్ల కాలంలో చాలా గ్రామాల్లో నయాపైసా పనిచేసింది లేదనీ, ఎమ్మెల్యే చేసిన ప్రచారంలో ఎంతమంది అభ్యర్ధులు గెలిచారో..? ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవుపలికారు. కనీసం రెండో.. మూడో స్థానంలోనూ కాంగ్రెస్ అభ్యర్థులు లేరని విమర్శించారు.
కలుద్దామని వస్తే.. కండువాలు కప్పుతున్నరు?
కొత్తగా గెలిచి ఎమ్మెల్యేను కలుద్దామని వచ్చిన కొత్త సర్పంచులకు శాలువాలకు బదులు కాంగ్రెస్ కండువాలు ఎందుకు కప్పుతున్నారని రసమయి నిలదీశారు. అధికారంతో ఎన్నికల్లో మాయ చేశారని, మార్నింగ్ వాక్, లంచ్ వాక్, ఈవెనింగ్ వాక్ అంటూ మహాత్మానగర్లో తిరిగితే ఆ అభ్యర్థి మూడో స్థానానికి వచ్చాడని ఎద్దేవా చేశారు. పోలంపల్లిలో కొండయ్యకు మద్దతు తెలిపి మల్లేశం గెలిచిన తర్వాత అతను కూడా తమ మనిషని ఎమ్మెల్యే చెప్పుకోవడం సిగ్గుచేటు కదా అని సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే మద్దతు తెలిపిన అభ్యర్థుల్లో కనీసం పది మంది అయినా గెలిచారా..? అని నిలదీశారు.
బాలయ్యపల్లెలో ఎమ్మెల్యే బలపర్చిన అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు రావడం ఆయన పని తనానికి నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఏకగ్రీవాలైతే రూ.20 లక్షలు ఇస్తామన్న మాట ప్రకారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ను కాదని బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు గెలిపించారనీ, అయినా సిగ్గులేకుండా బీఆర్ఎస్ సర్పంచులను కాంగ్రెస్లోకి రావాలంటూ బిచ్చగాడిలా ఎందుకు అడుక్కుంటున్నావని విమర్శించారు. నిధులిస్తామని చెప్తున్న ఎమ్మెల్యే.. ఇంతకుముందు ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గెలిచిన సర్పంచులు ఎవరూ భయపడొద్దని సూచించారు. ఎమ్మెల్యేకు, ఆయన పార్టీకి నిజాయితీ ఉంటే బీఆర్ఎస్లో గెలిచిన ఒక్క అభ్యర్థిని కూడా వారి పార్టీలో చేర్చుకోవద్దని సూచించారు. చిల్లర వ్యవహారాలు బందుపెట్టి, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని హితవుపలికారు.