Putta Madhukar | మంథని, జులై 11 : బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారని, పోలీసుల తీరు మారకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా పోలీస్ స్టేషన్లకు బోర్డులు పెడతామని ఆయన హెచ్చరించారు.
మంథని కోర్టు ఏరియాలో శుక్రవారం పుట్ట మధూకర్ విలేకరులతో మాట్లాడుతూ కేవలం బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా చేసుకొని అక్రమంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకుల మెప్పుకోసం బీఆర్ఎస్ నాయకుల పై కేసులు పెట్టి ఇబ్బందులు గురిచేయాలని చూస్తే చివరికి ఇబ్బందుల పాలయ్యేది పోలీసులే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతీ ఒక్క అంశాన్ని మా పింక్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామన్నారు.
మంథని నియోజకవర్గంలో ఇప్పటికే పూదరి సత్యనారాయణతో కలిపి ముగ్గురిపై కేసులు పెట్టి జైలుకు పంపాలని పోలీసులు వ్యూహాలు రచించారన్నారు. కానీ న్యాయస్థానాలు మాకు న్యాయం చేసి బెయిల్ మంజూరు చేశాయని అన్నారు. ప్రజల కోసం పోలీసులు పనిచేయాలని, కానీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదని, పోలీసులు తమ తీరును ఇప్పటికైనా మార్చుకోకపోతే పోలీస్ స్టేషన్లకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు అని బోర్డులు పెట్టడానికి కూడా తాము వెనకాడబోమని లేదని స్పష్టం చేశారు.
ఇలాంటి కేసులకు మా కార్యకర్తలు, మేము భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడే తమపై పెడుతున్న అక్రమ కేసులను ప్రజలు గమనిస్తున్నారని త్వరలో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. పార్టీలో ఒక్క కార్యకర్తకు కష్టం ఉంటే ఇలా అందరూ కలిసికట్టుగా ముందుకు సాగడం చాలా ఆనందంగా ఉందని, ప్రతీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.