Putta Madhukar | మంథని, ఫిబ్రవరి 6 : కాంగ్రెస్ పార్టీకి మంథని మున్సిపాలిటీని అప్పగిస్తే పట్టణ ప్రజలకు మిగిలేది కన్నీళ్లు.. కష్టాలేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులకు అవకాశమిస్తే సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని ప్రజలకు స్పష్టం చేశారు. మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 4, 5, 6, 10 వార్డుల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా వార్డుల పరిధిలోని అంబేద్కర్ క్, పూలే రస్తా, పద్మశాలి వీధి, జడ్పీహెచ్ఎస్ బాలుర స్కూల్, గంగాపురి, లైన్‌గడ్డ, కూచీరాజ్పల్లి, శ్రీరాంనగర్, బోయినిపేట, గొల్లగూడెం ఏరియాల్లోని ఇంటింటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా పుట్ట మధూకర్ మాట్లాడుతూ.. మంథని సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, బడుగు, బలహీన వర్గాలకు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామన్నారు.
గత పదేళ్ల బీఆర్ఎస్ జరిగిన అభివృద్ధిపై ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా అతలాకుతలమవుతున్నదన్నారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్‌ను అప్పగిస్తే మంథని పట్టణ ప్రజలకు మిగిలేది కన్నీళ్లు, కష్టాలేనన్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే పట్టణంలో మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఓటు ద్వారా ఆశీర్వదిస్తే సమగ్రాభివృద్ధికి కట్టుబడి పని చేస్తామన్నారు. ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరే విధంగా ప్రభుత్వంతో కోట్లాది పని చేస్తామన్నారు.
మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ మాట్లాడుతూ.. తాను సర్పంచ్, చైర్ పర్సన్‌గా పని చేసిన సమయంలో ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సహాయ సహకారాలతో మంథనిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. తమ పదవీ కాలం ముగియక ముందే మా పార్టీ కౌన్సిలర్లను కాంగ్రెస్‌లో చేర్చుకొని మున్సిపల్ పదవీ నుంచి తనను దూరం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి చైర్మన్ పదవీ దక్కిన తరువాతో మంథనిలో ఆరాచక పాలన మొదలైందన్నారు.
ప్రజలను, వ్యాపారస్తులను పట్టి పీడించిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్‌కు మున్సిపల్‌ను అప్పగిస్తే మళ్లీ అదే జరుగుతుందన్నారు. మంథనిలో అభివృద్ధి బాటలు పడాలంటే గులాబీ జెండా మున్సిపల్‌పై ఎగురాలన్నారు. ప్రజలకు బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.