Dasari Manohar Reddy | పెద్దపల్లి రూరల్ డిసెంబర్ 15 : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దిగి రావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ తో పాటు పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా ప్రచారం చేసి కార్నర్ మీటింగ్ లలో మనోహర్‌రెడ్డి మాట్లాడారు. రాఘవాపూర్ లో తాడిచెట్టి చామంతీ శ్రీకాంత్ కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.
గత రెండేళ్లుగా మోసపూరిత పాలనతో హామీలను అమలు చేయక మాయమాటలతో మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తుందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఓటమి భయంతో రెండు సంవత్సరాలు ఆలస్యం చేసిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటే బలమైన నాయకత్వం ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థులను గ్రామాల్లో సర్పంచులుగా గెలిపించాలని సూచించారు.
గ్రామాభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారం, స్వచ్ఛమైన పాలన కోసం బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. మహిళలకు నెలకు ₹2500 ఇవ్వలేదని, వృద్ధాప్య పింఛన్ రూ.4000 చేస్తామని హామీ ఇచ్చి అది కూడా అమలు కాలేదని, వికలాంగులకు నెలకు రూ.6000 ఇస్తామన్న హామీ కూడా నిలబడలేదని మండిపడ్డారు.
అలాగే కల్యాణ లక్ష్మికి తులం బంగారం ఇస్తామన్న మాట గాలికొదిలేసిందని ఎద్దేవా చేశారు. గత రెండు సంవత్సరాలకు మహిళలకు రూ.60,000, పెన్షనర్లకు రూ.48,000, వికలాంగులకు రూ.48,000 బాకీగా ఉందని ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఓటు అడగడానికి మీ ఇంటికి వచ్చినప్పుడు, బాకీ ఉన్న డబ్బులు ఇవ్వగలరా.. అని ప్రశ్నించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకులు, బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యులు చింతలఫణి సత్యనారాయణరెడ్డి, మండల అధ్యక్షుడు మర్కు లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ తోట శ్రీనివాస్, కొయ్యెడ సతీష్ గౌడ్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.