Godavarihani | గోదావరిఖని: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇచ్చిన పట్టాలిస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్సింగ్ కూల్చివేస్తున్నారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని బీజేపీ నాయకులు కోమల్ల మహేష్ కొండపర్తి సంజీవ్, సీనియర్ నాయకుడు మెరుగు హనుమంత్ గౌడ్, పిడుగు కృష్ణ ప్రశ్నించారు. గోదావరిఖని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్సింగ్ తన ప్రియమైన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని పలు సందర్భాల్లో చెప్పాడని ఆయన పేరుపై ఇచ్చిన పట్టా ఇప్పుడు పనికి రాదని ఇష్టం వచ్చిన రీతిలో కూల్చివేస్తున్నాడని బిజెపి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శించారు. అప్పటి మాజీ ఎంపీ కాకా వెంకటస్వామి కృషితో పట్టాలు ఇచ్చినట్లు చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ కారణంతో వాటిని కూల్చివేస్తున్నారో? చెప్పాలని వారు డిమాండ్ చేశారు సంవత్సరాల తరబడి మున్సిపల్ ఇంటి పన్ను కడుతూ నివాసముంటున్న చిరు వ్యాపారులను రోడ్ల వెడల్పు పేరుతో వారి కట్టడాలను కూల్చివేసి వీధులపాలు చేయడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు.
ఒకవేళ కూల్చివేతలు జరిగితే వారికి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని అవి మరిచిపోయి అర్థరాత్రి దొంగల మాదిరిగా కూల్చివేతలు చేయడం వారికి గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు అండగా నిలవడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. వన్ టౌన్ సీఐపై కేంద్ర ప్రభుత్వానికి అన్ని విభాగాలకు ఫిర్యాదులు చేయనున్నట్లు వారు స్పష్టం చేశారు రామగుండంలో జరుగుతున్న విధ్వంసాన్ని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకు వెళ్తామని వారు స్పష్టం చేశారు. గోదావరిఖని చౌరస్తాలో కూల్చివేసిన సిరి శెట్టి మల్లేశం కు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని వారు స్పష్టం చేశారు.