Karimnagar | తిమ్మాపూర్, డిసెంబర్ 10 : తిమ్మాపూర్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచిగా గెలిపిస్తే ఆ గ్రామానికి ఉచితంగా తన సొంత ఖర్చులతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేష్ హామీ ఇచ్చాడు. నుస్తులపూర్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను సర్పంచిగా గెలిపిస్తే ఆ గ్రామానికి విరాళంగా 500 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్ ను తన సొంత ఖర్చులతో ‘రమేష్ అన్న కానుక’గా ఏర్పాటు చేస్తానని రావుల రమేష్ తెలిపారు.
మండలంలోని 23 గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. బీఆర్ఎస్ నాయకుడు ఎక్కడ గెలిచినా ఆ ఊరి ప్రజలకు తాను కానుకగా అందిస్తానని రావుల రమేష్ స్పష్టం చేశారు. గ్రామాలలో బీఆర్ఎస్ నాయకులను సర్పంచ్‌గా గెలిపిస్తే రానున్న రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల కమిటీకి ఇతర కమిటీలకు చైర్మన్‌గా సర్పంచ్ అతనే ఉంటాడని, కాంగ్రెస్ నాయకులకే కాకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రమేష్ తెలిపారు.
గతం లో రమేష్ అన్న కానుక పేరిట ఆడపిల్ల పుడితే 110 మంది ఆడ పిల్లలకు రూ.5వేలు ఫిక్స్డ్ డిపాజిట్, గర్భిణులకు శ్రీమంతాలు చేశామనీ, గ్రామం లో ఎవరైనా నిరుపేదలు చనిపోతే ఉచితంగా దహన సంస్కారాలతో పాటు మృతుల కుటుంబాలకు బియ్యం పంపిణీ, వివాహాలకు కొత్త బట్టలను అందజేశామన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు బేతి శ్రీనివాస్ రెడ్డి, వంగల శ్రీనివాసరెడ్డి, దుర్శేటి అనిల్, నూనె సురేష్,
అజ్జు, దొంత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.