Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలుగా ఉన్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు పైరవీలకే ప్రాధాన్యత ఇస్తూ సింగరేణి కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదని హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఆరోపించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఆర్ జీవన్ యజమాన్యం జనరల్ మేనేజర్ గుర్తింపు కార్మిక సంఘానికి పనులు చేస్తూ వారు పైరవీలకు సహకరిస్తున్నాడని, ఈ క్రమంలో యూనియన్ నాయకులు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు.
సింగరేణిలో ఎన్నికల గడువు ముగిసినందున వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో పెద్ద సంఖ్యలోక్లరికల్ ఓవర్ మెన్ ఇతర పోస్టులు భర్తీ చేయకుండా యజమాన్యం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుందని, దీనిని ప్రశ్నించాల్సిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అచేతనమై నిమ్మకు నీరెత్తనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రమోషన్లు ఇచ్చిన కార్మికులను తిరిగి పాత పద్ధతిలోనే పనిచేయాలని, ఒత్తిడి తీసుకు వస్తున్నారని, ఇది సరైన విధానం కాదని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా సింగరేణి యజమాన్యం కార్మిక సమస్యలు పరిష్కారాన్ని కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఖయ్యూం, ఆరెల్లిపోశం, గాలి కిరణ్ కుమార్, పల్లె క్రాంతి కుమార్, దప్పిట సతీష్ తదితరులు పాల్గొన్నారు.