కోరుట్ల : అగ్రికల్చర్ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల చెప్పారు. పట్టణంలోని అల్లమయ్య గుట్ట ప్రభుత్వ మహిళా అగ్రికల్చర్ డిగ్రీ కళాశాలను ఎమ్మెల్యే గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కళాశాలలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.
కాలేజీలో అధ్యాపకుల కొరత ఉందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. విద్యార్థుల సమస్యలను ఓపికగా విన్న ఎమ్మెల్యే సంజయ్ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కళాశాలలో విద్యార్థినిలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యార్థినిలు, అధ్యాపకులతో మాట్లాడిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆందోళన పడవద్దని హామీ ఇచ్చారు.