MLA Dr Kalvakuntla Sanjay | కోరుట్ల, సెప్టెంబర్1 : పద్మశాలీల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పేర్కొన్నారు. పట్టణ శివారులోని కొనరావుపేట రోడ్డులో సీఎస్ఆర్ నిధులు రూ.50 లక్షలతో నిర్మించిన పద్మశాలీ సంఘ భవనాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావుతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పద్మశాలీల అభ్యున్నతి సంక్షేమం కోసం చేనేత రంగాన్ని ఆదుకోవడానికి సమాజంలో వారి సామాజిక ఆర్థిక ఎదుగుదలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. కోరుట్లలో పద్మశాలి కులస్తులకు సొంత భవనం నిర్మాణానికి రూ. 50 లక్షల నిధులు తీసుకువచ్చామన్నారు. భవనం చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన నిధులను తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పద్మశాలీ సమాజం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అడగకముందే రూ.కోటి నిధులు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు. పట్టణంలోని పద్మశాలీ సంఘ భవనంలో అభివృద్ధి పనులకు తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రూ.80 లక్షలు నిధులు, ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. రాబోయే కాలంలో కోనరావుపేట రోడ్డులోని రెండెకరాల ప్రభుత్వ స్థలంలో పద్మశాలీ విద్యార్థుల సంక్షేమం కోసం హాస్టల్ భవన నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని విద్యాసాగర్ రావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, నాయకులు గడ్డం మధు, జిల్లా ధనుంజయ్, ఆడెపు మధు, బండ్ల రవి కుమార్, కటకం వినయ్, అందే రాజ్ కుమార్, గోసుకొండ కుమారస్వామి, జక్కుల ప్రవీణ్ కుమార్, బండి సురేష్, రుద్ర విగ్నేష్ తదితరులు పాల్గొన్నారు.