హుజూరాబాద్ రూరల్, నవంబర్ 1: ‘మొంథా తుపాన్ కారణంగా రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కష్టకాలంలో ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా ప్రకటించిన నష్టపరిహారంతో నష్టం తీరదు. రైతులపై రేవంత్‌రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వరికి ఎకరాకు రూ.25 వేలు, పత్తికి రూ.50 వేల పరిహారం చెల్లించాలి. నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలి’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. హుజూరాబాద్ మండలం రాంపూర్, జూపాక గ్రామాల్లో ఇటీవల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను ఓదార్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అకాల వర్షం అన్నదాతలను ఆగం చేస్తుంటే, కన్నీళ్లు తుడువాల్సిన ప్రభుత్వం నామమాత్రంగా పరిహారం ప్రకటించడం చూస్తుంటే రైతులపై చిత్తశుద్ధి ఏమాత్రం ఉందో అర్థమైతున్నదన్నారు. వర్ష బీభత్సంతో రైతుల కండ్లల్లో కన్నీళ్లు తప్ప మిగిలిందేమీ లేవని, నేలరాలిన పంట చేలను చూసి విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోనే 30 వేల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనాలు ఉన్నాయని, కానీ అధికారులు మాత్రం 825 ఎకరాల్లో మాత్రమే నష్టం జరిగిందని నివేదికలు ఇవ్వడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టంపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన రైతులందరికీ నష్టపరిహారం అందించకపోతే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్. ఇరుమల్ల సురేందర్ రెడ్డి. కొలిపాక శ్రీనివాస్. దయాకర్‌రెడ్డి. గంధ శ్రీనివాస్, కొండాల్‌రెడ్డి ఉన్నారు.