హుజూరాబాద్, మే 22 : హుజూరాబాద్ ఏరియా దవాఖాన ఆర్ఎంవో సుధాకర్‌రావు, సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డిపై వేటుపడింది. ఏరియా దవాఖానకు చికిత్స కోసం వచ్చే రోగులను ఆర్ఎంవో జమ్మికుంటలోని తన సొంత ప్రైవేట్ దవాఖానకు తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్‌తోపాటు వైద్యారోగ్యశాఖ అధికారులు మూడునెలల క్రితం పలుసార్లు దవాఖానకు వచ్చి విచారణ చేపట్టారు.
వీరి నివేదిక ఆధారంగా ప్రభుత్వం దాదాపు నెలన్నర కింద దవాఖానలో పనిచేసిన 14 మంది వైద్యసిబ్బందిని సస్పెండ్ చేసింది. ఈ ఉదంతంలో కర్త, కర్మ ఆర్ఎంవో సుధాకర్‌రావు అని విచారణలో తేలడంతో ఆయనను కూడా సస్పెన్షన్ చేసింది. చికిత్స కోసం వచ్చే రోగులను దవాఖానలో పని చేస్తున్న డాక్టర్లు సొంత క్లినిక్‌కు తరలించకుండా అడ్డుకట్ట వేయడంలో విఫలమైనందుకు సూపరింటెండెంట్ రాజేందర్‌రెడ్డిని వైద్యావిధాన పరిషత్‌కు అటాచ్డ్ చేసింది. కొత్త సూపరింటెండెంట్‌గా దవాఖానలో అనస్తీషియన్‌గా పనిచేస్తున్న నారాయణరెడ్డిని, పిడియాట్రిక్గా పని చేస్తున్న రమేశ్‌ను ఆర్ఎంవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.