బోయినపల్లి రూరల్, జూన్ 10 : “నువ్వు సచ్చిపో.. నేను అతడితోనే ఉంటా” అని భార్య అవమానించడంతో ఓ భర్త వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండలో మంగళవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. తడగొండకు చెందిన కుంటాల హరీశ్(36)కు 2014లో కావేరితో వివాహం జరిగింది. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు.
అయితే, కుటుంబ పోషణ, తన ఇద్దరు పిల్లల భవిష్యత్ కోసం హరీశ్ గల్ఫ్‌కు వెళ్లాడు. ఈ సమయంలో కావేరి అదే గ్రామానికి చెందిన మన్నె రక్షణ్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నది. రెండు రోజుల క్రితం హరీశ్ ఇంటికి రాగా, భార్య వివాహేతర సంబంధం విషయం తెలిసింది. దీంతో ఆమెను నిలదీయడంతో ‘నేను రక్షణ్‌తోనే ఉంటా.. నువ్వు సచ్చిపో” అని అన్నది. దీంతో తీవ్ర అవమానానికి గురైన హరీశ్ గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. హరీశ్ తల్లి కుంటాల ప్రమీల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.