Murder | రామగిరి, సెప్టెంబర్ 14: పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని పన్నూరు గ్రామ పంచాయతీ పరిధిలోని వకీలు పల్లి ప్లాట్స్‌లో ఆదివారం పట్ట పగలు జరిగిన దారుణ ఘటన స్థానికులను కలిచివేసింది. కుటుంబ కలహాలు భయంకర రూపం దాల్చి భార్య ప్రాణాలను బలిగొన్నాయి. స్థానికుల కథనం ప్రకారం.. పూసల రమాదేవి (35) అనే మహిళను ఆమె భర్త కృపాకర్ కత్తితో దారుణంగా హత్య చేశాడు.
ఇళ్లలో తరచుగా జరుగుతున్న చిన్నా చితకా వాదనలు ఆదివారం ఘర్షణకు దారి తీసినట్లు సమాచారం. ఆ సమయంలో ఆగ్రహంతో కృపాకర్ రమాదేవిపై దాడి చేసి అక్కడికక్కడే చంపేశాడు. ఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రామగిరి ఎస్ఐ బృందం తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించింది. అనంతరం రమాదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. హత్య అనంతరం కృపాకర్ పరారయ్యాడు.
దీంతో పోలీసులు అతడి కోసం ఆరా తీస్తున్నారు . కుటుంబ కలహాలే హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఈ దారుణ ఘటనతో వకీలు పల్లి కాలనీలో తీవ్ర విషాదం నెలకొంది. రమాదేవి మరణవార్త తెలిసిన బంధువులు, గ్రామస్థులు కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.