Human rights | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 10 : ప్రతీ మనిషి గౌరవంగా జీవించేందుకు మానవ హక్కులు మూలాధారమని, అందరూ హక్కులు తెలుసుకొని ఇతరుల హక్కులను గౌరవించాలని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జే శ్రీనివాసరావు అన్నారు.
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ సేవాధికర సంస్థ అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పీ నీరజ ఆదేశాలతో సీనియర్ సివిల్ జడ్జి/కార్యదర్శి, డీఎల్ఎస్ఏ పీ లక్ష్మణాచారి సమన్వయంతో బుధవారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ న్యాయ సహాయం ద్వారా ప్రజల హక్కులను రక్షిస్తోందని అన్నారు. ఈ సదస్సులో లోక్ అదాలత్ సభ్యులు/న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్ పీ పద్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.