నమస్తే నెట్వర్క్ : ఖమ్మాన్ని జన ఉప్పెన కమ్ముకున్నది. నగరం గులాబీమయమైంది. బీఆర్ఎస్ జెండాలు, కటౌట్లు, ఫ్లెక్సీలతో కళకళలాడింది. ఉద్యమ గుమ్మంలో అద్భుతం ఆవిష్కృతమైంది. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్, బీజేపీయేతర రాజకీయాలకు నాంది పలికింది. మతోన్మాద శక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా బీఆర్ఎస్ సభ దద్దరిల్లింది. ఢిల్లీ పీఠం పునాదులు కదిలేలా సాగింది. అందుకు ఖమ్మం శివారు వీ వెంకటాయపాలెంలోని వందెకరాల స్థలం వేదికైంది. ధూంధాం పాటలతో ప్రతిధ్వనించింది.. బుధవారం బహిరంగ సభకు ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల నుంచి లక్షలాది మంది ప్రజలు హాజరయ్యారు.
సభకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌తో పాటు పంజాబ్, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులు భగవంత్‌మాన్, విజయన్, అరవింద్ కేజ్రీవాల్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా హాజరయ్యారు. తొలుత వారు సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభించారు. మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. అనంతరం సభలో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కారదర్శి కూనంనేని సాంబశివరావు బీఆర్ఎస్కు మద్దతుగా మాట్లాడారు. సభ ఆద్యంతం ప్రజలను ఉత్తేజ పరిచింది. నాయకుల్లో నూతనోత్సాహాన్ని నింపింది..
ఖమ్మం కలెక్టరేట్లో కంటి వెలుగు బ్రోచర్‌ను ఆవిష్కరిస్తున్న ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్, భగవంత్‌మాన్, విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, రాష్ట్ర మంత్రులు
ఖమ్మం శివారులో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ఘనంగా ప్రారంభించడంతో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 46 ప్రభుత్వ శాఖలు ఒకేచోట ఉంటాయని, దరఖాస్తుదారులు ఏ పనిపై వచ్చినా ఆయా శాఖల అధికారులను కలిసి పని పూర్తిచేసుకునే వెసులుబాటు లభిస్తుందని సీఎం కేసీఆర్ అతిథులకు విశదీకరించారు.
కలెక్టరేట్లో సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌తో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాటామంతి
ఖమ్మంలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కళాశాలను మంజూరు చేస్తున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి వచ్చే విధంగా యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టి పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
ఖమ్మం సభకు హాజరైన ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు