గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏడాది కిందట మొదలైన ఈ తంతు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఇది సెర్ప్ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీస్తున్నది. వంద శాతం బదిలీల పేర నోటిఫికేషన్ వెలువడి రెండు నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు కేవలం ఎల్ 5, ఎల్ 4 అధికారులకు మాత్రమే కౌన్సెలింగ్ నిర్వహించి, బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ 3 కేటగిరీకి ఆప్షన్స్ అవకాశమిచ్చినా, మిగతావారికి ఇప్పటివరకు ఆదేశాలు జారీ చేయకపోవడంతో బదిలీలకు ఇంకెంతకాలం పడుతుందోననే అసహనం ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, జూలై 14 : కాంగ్రెస్ ప్రభుత్వం పాలనాపగ్గాలు చేపట్టగానే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో బదిలీల అంశం తెరపైకి రాగా, మేలో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అనంతరం సెర్ప్ సీఈవో బదిలీల నోటిఫికేషన్ వెలువరించింది. ఆ వెంటనే అన్ని కేటగిరీలకు కౌన్సెలింగ్ చేపట్టి, బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అందజేయాల్సి ఉండగా, కేవలం అదనపు పీడీలు, డీపీఎంలకు మాత్రమే నిర్వహించారు. ప్రాధాన్యతాక్రమంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో స్థానచలనం కల్పించారు.
అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్లకు కౌన్సెలింగ్ జరిపినా, ఇప్పటి వరకు బదిలీ ఉత్తర్వులు మాత్రం అందజేయ లేదు. వంద శా తం బదిలీలే లక్ష్యంగా నోటిఫికేషన్ వెలువరించినా, ఇంకా ఎల్ 2, ఎల్ 1, ఎంఎస్సీసీలకు సంబంధించి ఎలాంటి ప్రాసెస్ ప్రారంభించనే లే దు. దీంతో, బదిలీల్లో తమకు అనుకూలమైన స్థానం కోసం సంబంధి త సిబ్బంది పైరవీలు చేసుకోవడమే తప్ప నిర్వహించాల్సిన విధులపై దృష్టిసారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగా ఉమ్మడి జిల్లాలో గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న అనేక కార్యక్రమాలు కుంటుపడుతున్నట్లు ఆ శాఖ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
పూర్వస్థానాల కోసం ప్రయత్నాలు
ఉమ్మడి జిల్లా పరిధిలోని నాలుగు కొత్త జిల్లాల్లో ఏళ్లకేళ్లుగా తిష్టవేసి తమకంటూ ప్రత్యేకంగా కోటరీ నిర్మించుకున్న కొంతమంది డీపీఎంలు, ప్రస్తుతం తమకు బదిలీ అయిన స్థానాల్లో విధులు నిర్వహించేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నట్టు తెలుస్తున్నది. గతంలో తాము పనిచేసిన జిల్లా కేంద్రాల్లోకి తిరిగి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఉద్యోగంతోపాటు సైడ్ బిజినెస్లు కూడా నిర్వహిస్తూ రెండు చేతులా సంపాదనకు అలవాటు పడి ప్రస్తుతం బదిలీ అయిన స్థానంలో విధులు నిర్వర్తించేందుకు ససేమిరా అంటున్నట్టు ఆ శాఖ వర్గాలే చెబుతున్నట్టు తెలుస్తున్నది.
బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారి నెలల తరబడి కొనసాగుతుండగా, సందట్లో సడేమియాలా అధికార నాయకులతో సెర్ప్ యంత్రాంగం ఒత్తిడి తెస్తుండడంతో నిజాయితీగా విధులు నిర్వహించే ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే వాదన వినిపిస్తున్నది. ఉమ్మడి జిల్లాలో బదిలీ అయిన వారిలో కొంతమంది వేర్వేరు వ్యాపారాలు చేస్తూ, విధుల నిర్వహణ విషయంలో నిర్లక్ష్యం చూపుతున్నారని ఆశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వీరంతా పొద్దటి పూట కార్యాలయాల్లో, రాత్రిపూట రాజకీయ నేతలతో పైరవీలు చేయిస్తున్నారు, ‘మావాళ్లు మీ వద్దకొస్తున్నారు. కొంచెం చూడండి. వారిని పాత చోటుకు మళ్లీ పంపండి’ అంటూ అధికారులకు ఫోన్లు చేసి చెబుతున్నట్టు తెలుస్తుంది. బదిలీల పర్వంలో అధికారులు కనబరుస్తున్న జాప్యంతోనే ఈ తతంగమంతా జరుతున్నదని ఆశాఖ వర్గాలు మండిపడుతున్నాయి.