‘యూరియా కోసం ఇంకెన్ని రోజులు తిరగాలి. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. అసలు యూరియా ఇస్తరా.. చావమంటరా..? సచ్చిపోయినంక బస్తా ఇస్తా అంటే పెట్రోల్ తాగి సచ్చిపోత’ అంటూ కోనరావుపేట మండలం పల్లిమక్తకు చెందిన జిన్న దుర్గయ్య పెట్రోల్ డబ్బాతో ఆందోళనకు దిగాడు. శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో ఆయన కొలనూర్ సహకార సంఘం పరిధిలోని సుద్దాల రైతు వేదిక వద్దకు వచ్చాడు. అప్పటికే అక్కడ దాదాపు 800 మంది రైతులు ఉండడంతో తనకు యూరియా దొరుకుతుందో లేదోనని ఆందోళన చెందాడు. తనకు యూరియా ఇవ్వాలని పెట్రోల్ డబ్బా పట్టుకొని వ్యవసాయ అధికారులను నిలదీశాడు. ‘సారూ నాకు రెండున్నర ఎకరాలు ఉన్నది. నెలన్నర క్రితమే నాటేస్తే అప్పుడు నీళ్లులేక అంతా ఎండిపోయింది. మళ్ల వారం రోజులకే నాటేసిన. నెల కిందట ఆధార్ కార్డును క్యూలైన్లో పెడితే ఇప్పటివరకు ఒక్క యూరియా బస్తా కూడా ఇయ్యలె. మళ్లీ అడిగితే ఇస్తామని అంటున్రు. అసలే నా పాణం సక్కగలేక దవాఖానల పొంటి తిరుగుతున్న. ఇప్పటివరకు ఒక్క బస్తా కూడా చల్లలె. ఇట్లయితే పంట ఎట్ల పండుతది సారూ” అని కంటతడి పెట్టాడు. ‘నేను సచ్చిపోయినంకనే యూరియా ఇస్తానంటే చెప్పండి. సచ్చిపోత’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో అధికారులు స్పందించారు. రైతు జిన్న దుర్గయ్యకు రెండు బస్తాలు అందించారు.
– కోనరావుపేట, సెప్టెంబర్ 12
సిరిసిల్ల రూరల్/ ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 12: నాటేసి నెలన్నర దాటినా యూరియా అందక రైతులు అరిగోస పడుతున్నారు. ఎర్రబడుతున్న పంటలను చూసి తట్టుకోలేక, సాగు పనులు వదులుకొని రోడ్డెక్కుతున్నారు. రాత్రనకా.. పగలనకా పడిగాపులు గాస్తూ ఆగమవుతున్నారు. కొందరు సొమ్మసిల్లి పడిపోతున్నారు. అయినా ఒక్క బస్తా కూడా అందక ఆందోళన బాట పడుతున్నారు. కడుపుమండి ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. కొందరు యూరియా లోడ్ లారీలను అడ్డగిస్తున్నారు. మరికొందరు అధికారులను నిలదీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టోకెన్లు ఇచ్చి చేతులు దులుపుకొంటుండగా, రోజుల కొద్దీ తిరుగుతున్నా బస్తాలు మాత్రం రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఒక్కోసారి ఒకటీ రెండు దొరుకుతున్నా అవి ఏ మూలకు సరిపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదని, కానీ, ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో అరిగోస పడాల్సి వస్తున్నదని వాపోయారు. సర్కారు వైఫల్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడుతున్నారు. ఇవాళ ఏకంగా రైతన్న పెట్రోల్ డబ్బా చేత పట్టుకొనే పరిస్థితి వచ్చిందంటే అందుకు కాంగ్రెస్సే కారణమని మండిపడ్డారు. ఇలా రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి ఏ మాత్రం మంచిది కాదని హితవు పలికారు. ఇప్పటికైనా మేల్కోవాలని, కొరత తీర్చి సరిపడా యూరియా అందించాలని వేడుకున్నారు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబర్ 12 : తంగళ్లపల్లి మండల కేంద్రంలోని కేడీసీఎంస్ ఫర్టిలైజర్ దుకాణంలో 450 బస్తాలు యూరియా రాగా, శుక్రవారం తెల్లవారుజామునే రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఉదయాన్నే ముసురు వానలో ఆధార్‌కార్డు, పాస్ బుక్ పుస్తకాల జిరాక్స్ పత్రాలు తీసుకుని వచ్చారు. సుమారు 800 మందికిపైగా రాగా, పత్రాలను అందించడానికి ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో తోపులాట జరిగింది. పోలీసులు చేరుకుని రైతులను సముదాయించి, ఒక్కొక్కరి ఆధార్‌కార్డు, పాసుబుక్‌ను పరిశీలించి, ఒక్క బస్తా చొప్పున టోకెన్ ఇచ్చారు. కాగా, మొదట యూరియా బస్తాకు అధికంగా వసూలు చేస్తున్నారనే ప్రచారంతో పలువురు రైతులు వ్యవసాయ అధికారులను నిలదీశారు. దీంతో వాగ్వాదం జరగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. నిర్ణీత ధరకే అందిస్తున్నామని అధికారులు పేర్కొనడంతో వివాదం సద్దుమణిగింది. మధ్యాహ్నం 2 గంటల వరకు టోకెన్లు అందించా రు. సుమారు 300 నుంచి 350 మందిరైతులు తిరిగి వెళ్లిపో యారు. రైతు వేదిక వద్ద టోకెన్లు ఇవ్వగా, తంగళ్లపల్లిలోని అంబేద్క ర్ విగ్రహం ఎదుట ఉన్న గోదాంలో యూరియా బస్తాలను పంపిణీ చేశారు. ఇటు టోకెన్ల కోసం గంటల తరబడి వేచి ఉన్న రైతులు మరో అరకిలోమీటర్‌లో ఉన్న గోదాంకు వెళ్లి యూరియా బస్తాలను తీసుకెళ్లారు.
సైదాపూర్, సెప్టెంబర్ 12 : సైదాపూర్ మండలకేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్‌కు యూరియా వస్తుందన్న సమాచారం మేరకు శుక్రవారం ఉదయం 6 గంటలకే సుమారు 400 మంది రైతులు పలు గ్రామాల నుంచి తరలివచ్చారు. చెప్పులను వరుసలో పెట్టి వేచి ఉన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో ఎస్ఐ తిరుపతి సిబ్బందితో కలిసి వచ్చి చక్కదిద్దారు. గ్రోమోర్ సిబ్బంది 10.30 గంటలకు 170 బస్తాలకే టోకన్లను ఇవ్వడంతో సుమారు 200 మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు.
చందుర్తి, సెప్టెంబర్ 12 : చందుర్తి మండలం జోగాపూర్‌లో రైతులు శుక్రవారం ఉదయం 4 గంటలకే తరలివచ్చారు. సుమారు 250 మంది చెప్పులు, సంచులు, ఆధార్ కార్డులు, పట్టాధార్ పాసుబుక్కులు.. ఇలా ఏది అందుబాటులో ఉంటే అది క్యూలో పెట్టి గంటల కొద్దీ నిరీక్షించారు. ఇందులో 190 మందికి టోకెన్లు అందించారు. 244 బస్తాలు రాగా, ఒక్కో రైతుకు ఒకటి, రెండు చొప్పున మాత్రమే అందించారు. గంటల తరబడి వేచి ఉన్నా 70 మందికి బస్తాలు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
సుల్తానాబాద్, సెప్టెంబర్12 : సుల్తానాబాద్‌లోని సహకార గోదాంకు 340 బస్తాల లోడ్ వచ్చిందని తెలియడంతో రైతులు శుక్రవారం తెల్లవారుజామునే తరలివచ్చారు. సుమారు 500 మంది చెప్పులు వరుసలో పెట్టి గం టలతరబడి వేచిచూశారు. క్యూ విషయంలో రైతులు గొడవపడ్డారు. పోలీసుల వచ్చి, ఆందోళన విరమింపజేశారు. అనంతరం పహారా మధ్యన యూరియా పంపిణీ చేశారు. అయితే ఒక్కో రైతుకు రెండు బస్తాల చొప్పున 170 మందికి ఇవ్వగా, 300కుపైగా రైతులు నిరాశతో వెనుదిరిగారు. నా ట్లేసి నెలన్నరదాటినా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 12: ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్‌లో మహిళా సంఘం పక్షాన 300 బస్తాలను పంచుతారని తెలిసి రైతులు శుక్రవారం తెల్లవారుజామున ఒంటి గంట నుంచే తరలివచ్చారు. గుండారం, తిమ్మాపూర్, బాకుర్పల్లికి చెందిన సుమారు 300 మంది ఆధార్ కార్డులు, చెప్పులు లైన్లో పెట్టి నిలుచున్నారు. పెద్ద సంఖ్యలో రావడంతో పంపిణీ కేంద్రం వద్ద పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతోపాటు ఉదయం వర్షం వచ్చినా తమ లైన్ ఎక్కడ మిస్ అవుతుందోనని భయంతో వానలో కొందరు గొడుగులు పట్టుకుని నిల్చొని ఉండగా, మరికొందరు అదే వర్షంలో తడుస్తూ ఉండిపోయారు. ఒక్కొక్కరికి రెండు బస్తాల చొప్పున 150 మందికే ఇవ్వగా, మిగతా వారు అసహనం వ్యక్తం చేస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్‌కు సైతం 220 బస్తాలు వచ్చాయని తెలిసి, వారం కిందట టోకెన్లు తీసుకున్న రైతులతోపాటు కొత్త రైతులు వచ్చారు. ముందుగా టోకెన్లు తీసుకున్న రైతులకు ఒక్కో బ్యాగు అందజేశారు. ఉదయం 11 గంటల వరకే స్టాక్ అయిపోగా, లైన్లో మిగతా రైతులకు టోకెన్లు ఇచ్చారు.
నేను మూడెకరాలల్ల వరి వేసినం. నెలన్నర క్రితం నాటేసినం. ఇరువై రోజులు తిరిగితే రెండు బస్తాలు దొరికినయ్. మళ్లా యూరియా కోసం ఎదురు చూసినం. తంగళ్లపల్లి, పద్మనగర్ దుకాణాల్లో తిరిగినం. దొరకలే. పదిహేను రోజులుగా తిరిగితే ఇయ్యాళ ఒక్క బస్తా దొరికింది. మబ్బుల ఐదు గంటలకు లైన్ కడితే ఇచ్చిన్రు.
– మంగమ్మ, రాళ్లపేట (తంగళ్లపల్లి మండలం)
నేను పదెకరాలు పంట వేసిన. రెండు నెలల కిందట వరి నాటేసిన. యూరియా కోసం ఇక తిరుగుతున్న. నెల కిందట తిరుగంగా తిరుగంగా నా భార్య పాస్‌బుక్, నా పాస్‌బుక్ పేరిట ఐదు బస్తాలు దొరికినయ్. మళ్లీ నెల తిరిగితే నాకు, నా భార్య పేరిట రెండు బస్తాలు ఇచ్చిన్రు. ఈ బస్తాలు ఎట్ల సరిపోతయ్? ఈ బస్తాలకు ఎగిలవారంగ వచ్చి లైన్లో నిలబడ్డం. ఇట్ల లైన్ల నిలబెట్టుకుంటా రైతులను ఆగం చేస్తున్నరు. లైన్ల నిలబడ్డ యూరియా దొరుకుతదని గ్యారంటీ లేదు.
– సుధాకర్‌రెడ్డి, లక్ష్మీపూర్, (తంగళ్లపల్లి మండలం)