Siricilla | రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 3 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో అర్హులైన ప్రతీ దళిత కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత హక్కుల పోరాట సమితి (DHPS) రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లపల్లి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. డీహెచ్‌పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లతో నిరసన చేపట్టిన నాయకులు, దళితులకు ప్రకటించిన సంక్షేమ హామీలు అమలులో కనిపించడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.
ఈ సందర్భంగా తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ జిల్లాలో వేలాది మంది దళిత కుటుంబాలు ఇప్పటికీ సొంత ఇంటి కోసం ఎదురుచూస్తున్నాయని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించినప్పటికీ ఇళ్ల మంజూరు ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందే తప్ప, భూమిపై ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా జిల్లాలోని ప్రతీ అర్హులైన దళిత కుటుంబానికి ఇళ్లను మంజూరు చేసి, నిర్మాణాలకు అవసరమైన నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో దళిత నాయకులు, దళితులు పాల్గొన్నారు.