మానకొండూర్ రూరల్, అక్టోబర్ 4: ‘పడుకున్న కొడుకును గిట్లా ఆ దేవుడు తీసుకుపాయె.. నా కండ్ల ముందటే గిట్లాయె భగవంతా.. బడిఉన్నా బతుకుదువు బిడ్డా’.. అంటూ చనిపోయిన కొడుకును తలుచుకుంటూ ఆ తల్లిదండ్రులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. వివరాల్లోకి వెళ్తే.. మానకొండూర్ మండలం ఈదులగట్టెపల్లి గ్రామానికి చెందిన అంగిడి అనిత-రాజు దంపతులకు కూతురు రితిక, కొడుకు సాయికుమార్(7) ఉన్నారు. తల్లిదండ్రులు పరదాలను అద్దెకు ఇస్తుండేవారు.
రాజు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. దసరా పండుగ సెలవులు కావడంతో శుక్రవారం సాయంత్రం సమయంలో సాయికుమార్ ఇంట్లోనే నిద్రిస్తుండగా.. తల్లీకూతురు బయట ఉన్నారు. తండ్రి రాజు పనుల నిమిత్తం బయటికి వెళ్లాడు. ఇంతలో షార్ట్‌సర్క్యూట్ కావడంతో ఆరుబయట ఉన్న తాటికమ్మలు అంటుకుని మంటలు బాగా వ్యాపించాయి. సాయికుమార్ నిద్రలేచే సరికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. మంటల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఒక డోర్ వైపు పరదలు అంటుకోగా, మరో డోర్ లాక్ అయింది. స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించినా మంటల వ్యాప్తికి ఏం చేయలేకపోయారు. సాయికుమార్ మరో రూమ్‌లోకి వెళ్లి డోర్ పెట్టుకున్నాడు.
అప్పటికే మంటల వ్యాప్తి, పొగతో ఊపిరాడక ఓ మూలన పడిపోయాడు. గ్రామస్తుల సమాచారం మేరకు ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటల్లోనే సజీవ దహనం అయిన బాలుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. పండుగపూట సాయికుమార్ మృతితో గ్రామంలో విషాదం చోటుచేసుకున్నది. ఘటనా స్థలాన్ని మానకొండూర్ ఇన్చార్జి సీఐ స్వామి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.