కమాన్‌చౌరస్తా/ తెలంగాణచౌక్/ విద్యానగర్/ కొత్తపల్లి, జమ్మికుంట/ వీణవంక/ ఇల్లందకుంట/ శంకరపట్నం/ సైదాపూర్/ చొప్పదండి/ గంగాధర/ చిగురుమామిడి/ కరీంనగర్ రూరల్/ తిమ్మాపూర్, మార్చి 14 : జిల్లా వ్యాప్తంగా రంగుల ఖేలీ హోలీ వేడుకలు శుక్రవారం ఆనందోత్సాహాలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే అన్ని వర్గాల ప్రజలు రంగులు తీసుకొని వీధుల్లోకి వచ్చారు. కేరింతలు కొడుతూ పరస్పరం రంగులు పూసుకున్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఆమె భర్త దీపాంక్సత్పతి, అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, కుటుంబ సభ్యులు హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన హోలీ వేడుకలకు హాజరయ్యారు.
అలాగే, నగరంలో చిన్నారులు, పెద్దలతో మమేకమై మాజీ మేయర్ సునీల్ రావు రంగులు పులుముతూ శుభాకాంక్షలు తెలిపారు. అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో వేడుకలు నిర్వహించగా, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని నృత్యాలు చేస్తూ, రంగుల చల్లుకున్నారు. ఐఎంఏ హాల్లో జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎనమల్ల నరేశ్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించగా, వైద్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లయన్స్‌క్లబ్ కరీంనగర్ గోల్డెన్ శాతవాహన ఆధ్వర్యంలో హోలీ వేడుకలు నిర్వహించారు.
జిల్లా టీఎన్జీవో అధ్యక్షుడు దారం శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టీఎన్జీవో ఫంక్షన్‌హాల్ ముందు నాయకులు, ఉద్యోగులు డప్పుచప్పుళ్ల మధ్య వేడుకలు జరుపుకొన్నారు. ఆర్యవైశ్య సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి పెద్ది వేణుగోపాల్, మహిళా నాయకురాలు కవిత ఆధ్వర్యంలో చైతన్య పురిలో హోలీ వేడుకలు ఉత్సాహంగా సాగాయి. గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హోలీ వేడుకల్లో పాల్గొని ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.