Urea | ధర్మారం, సెప్టెంబర్ 6: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రైతులకు యూరియా అవస్థలు తప్పడం లేదు. వానా కాలంలో సాగు చేసిన వరి పొలాలకు రెండో దఫా వేయడానికి సరిపడ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా శనివారం పత్తిపాక గ్రామంలోని సింగిల్ విండో కార్యాలయం వద్ద రైతులు సద్ది పట్టుకుని యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొంది.
సింగిల్ విండో గోదాంకు 340 యూరియా బస్తాలు వచ్చాయనే సమాచారంతో పత్తిపాక, నర్సింగాపూర్, నాయకం తండా, మల్లాపూర్, కమ్మర్ ఖాన్ పేట, లంబాడి తండా (కే) గ్రామాల సుమారు 500 మంది పైబడి రైతులు తరలివచ్చారు. యూరియా తమ వెంట తెచ్చుకున్న ఆధార్ కార్డు, భూమి పట్టాదారు పాస్ పుస్తకాల జిరాక్స్ ప్రజలను క్యు లైన్ లో పెట్టారు. దీంతో రైతులు యూరియా కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఒక దశలో ఎక్కువ సమయం వేచి ఉన్న కారణంతో అలసిపోయిన కొంతమంది రైతులు తమ వెంట తెచ్చుకున్న భోజనాలు అక్కడే చేశారు.
పెద్ద సంఖ్యలో రైతులు కోసం రావడంతో పోలీస్ బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేపట్టారు. ఎన్ని ఎకరాల భూమి ఉన్నా వచ్చిన రైతులకు కేవలం ఒక బస్తా యూరియా మాత్రమే సింగిల్ విండో అధికారులు పంపిణీ చేశారు. దీంతో రైతులు చేసేదేమీ లేక రోజంతా పడిగాపులు కాసి చేసేదేమీ లేక ఒక బస్తా యూరియాను తీసుకెళ్లారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరిపడా యూరియా తెప్పించాలని రైతులు డిమాండ్ చేశారు.