ఎండల ప్రభావం కూరగాయల దిగుబడులపై పడింది. అసలే అంతంత సాగు.. దానికి తోడు వేసవిలో దిగుబడులు రాకపోవడంతో సామాన్య వినియోగదారులు కొనలేని పరిస్థితి కనిపిస్తున్నది. ఒకట్రెండు మినహా ప్రతి కూరగాయ ధర పెరిగింది. వారం పది రోజుల కింద రూ.30 నుంచి రూ.40కి కిలో ఉన్న టమాట ఇప్పుడు ఏకంగా రూ.వంద దాటింది. పచ్చి మిర్చి ధర అగ్గి మండుతోంది. కిలో రూ.120-140 అమ్ముతుండడంతో సామాన్యులు అరకిలో బదులు పావుకిలోతో సరిపెట్టుకుంటున్నారు. మిగతా కూరగాయలు సైతం ప్రియమయ్యాయి. వీటి పరిస్థితి ఇలా ఉండగా ఆకుకూరల వైపు చూస్తున్న వినియోగదారులకు అక్కడ కూడా అగ్గిలో చెయ్యి పెట్టినట్లే ఉన్నది.
కరీంనగర్, జూన్ 30(నమస్తే తెలంగాణ): కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఎండకాలంలో పండించిన పంటలు నెల క్రితం కురిసిన ఆకాల వర్షాల వల్ల కుళ్లిపోవడంతో చేతికి వచ్చిన పంట నెలపాలైంది. మిగిలిన పంట ఎండలకు దిగుబడి తగ్గింది. ఉన్న కొద్ది పంటను కాపాడుకుని మార్కెట్కు తీసుకువస్తుండడంతో కూరగాయలకు డిమాండ్ ఏర్పడి, ధరలు విపరీతంగా పెరిగాయి. టమాటా రూ.100 దాటగా, నిన్నా మొన్నటి వరకు రూ.60 నుంచి రూ.70 వ రకు ఉన్న బీరకాయల ధర కూడా ఇప్పుడు రూ.వంద దాటింది. క్యాబేజీ, కాలీఫ్లవర్, క్యా రెట్, మునుగ ధరలు కూడా విపరీతంగా పెరిగా యి. బిన్నీస్ అయితే పది పదిహేను రోజుల కింద రూ.60-70 కిలో ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.160కి చేరింది. పచ్చి మిర్చి రూ.140 వరకు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి కూరగాయ ధర పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితికి వచ్చిం ది. ఇక ఆకు కూరల ధరలు సైతం పెరిగాయి. పాలకూర నిన్నా మొన్నటి వరకు రూ.40 ఉండగా, ఇప్పుడు రూ.60కి కిలో అయింది. తోట కూర, చుక్కకూర పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కొత్తిమీర ధర కిలోకు రూ.200 కాగా మెంతి రూ.300 కిలో అమ్ముతున్నారు. ధరలు అమాంతం పెరగడంతో మార్కెట్లో అమ్మకాలు పడిపోయాయని, మరో పక్క కూరగాయల వ్యాపారులు వాపోతున్నారు. వేసవిలో కూరగాయల సాగు తగ్గి పోవడం, సాగు చేసిన పంటల్లో ఎండల కారణంగా దిగుబడులు రాకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోం ది. జిల్లాకు అవసరమైన కూరగాయలు రాష్ట్రంలోని ఇతర జిల్లాలు, ఇతర రాష్ర్టాల నుంచి తెప్పిస్తున్నారు. అయితే, అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉండటంతో కూరగాయ ఉత్పత్తులు పడిపోయా యి. దీంతో ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితికి కూరగాయలు చేరుకున్నాయి.
ఇతర ప్రాంతాల నుంచి పచ్చి మిర్చి
జిల్లాలో పండించిన పచ్చిమిర్చితోపాటు ఇతర ప్రాంతాల నుంచి మిర్చి రావడంతో ధరలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం జిల్లాలో మిర్చిసాగు లేకపోవడంతో మొత్తం ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. అందుకు రవాణా ఖర్చులు పెరగడంతో పాటు వినియోగం పెరగడం వల్ల ధరలు ఆమాంతం పెరిగాయి.
మా అసోంటోళ్లు కొనలేరు
నాలుగైదు రోజుల నుంచి కూరగాయల ధరలు విపరీతంగా పెరిగినయ్. మా అసోంటి సామాన్యులు కొనలేని పరిస్థితి వచ్చింది. నిత్యం ఎండకాలం అయిపోంగనే ఇట్లాంటి పరిస్థితితే వస్తది. మిగతా కూరగాయలు బాగా ధరలున్నయని రూ.30 పెట్టి పావుకిలో దొండ కాయలు తీసుకున్న. ఇంకో రూ.30 పెట్టి కాకరకాయలు తీసుకున్న. పచ్చి మిర్చి కొందామంటే ధర ఎక్కువున్నది. టమాట సుతం ఇట్లనే ఉంది.
– రేవెల్లి ఎల్లయ్య, వినియోగదారుడు
అగ్గిల చెయ్యివెట్టినట్టే ఉన్నది
కూరగాయల కొనవోతే అగ్గిల చెయ్యివెట్టినట్టే ఉన్నది. ఏది ము ట్టినా పిరమే. తినుడు తప్పదాయె. ఎన్ని పైసలైనా కొన్కపోవాలె. కిలో టమాటలు తీస్కపోయేదాన్ని ఇప్పుడు అరకిల కొందామన్న మనసత్త లేదు. చేతుల పైసలు సుతం లేవు. మాది గర్రెపల్లి, కర్నారం వచ్చినమని ఇన్న న్ని కూరగాయలు కొన్కపోతమని మార్కెట్లకస్తే ఈడ గిట్లున్నది. ఎప్పుడు ఇట్లుంటే ఎట్ల బత్కుతం. నాలుగొద్దులైతే మల్ల పంటత్తది. ధరలు తగ్గుతయ్.
– దావు నర్సమ్మ, వినియోగదారురాలు
మునుపటిలెక్క గిరాకీ లేదు
కూరగాయలు ధరలు తక్కువుంటెనే ఎక్కువ గిరాకీ అయితది. ఇప్పుడు ధరలు పెరిగినంక అసలే గిరాకీ అయితలేదు. గంపల టమాటలు వెట్టుకొని పొద్దుగాల సంది కూసున్న. రెండు కిలోలు సుతం పోలే. మునుపు ఈపాటికే రెండు గంపల టమాటలు అమ్ముకునేదాన్ని. టమాట కిలో వంద అనెవరకు ఎవ్వలు తీస్కుంటలేరు. ధరలు తగ్గితెనే మాకు గిరాకీ అయితది. ఇంకొన్నొద్దులు ఇట్లనే ఉంటది.
– కొండ గంగాభవాని, చిరు వ్యాపారి
దిగుబడులు తగ్గినయ్
కూరగాయల ధర లు పెరగడానికి కార ణం దిగుబడులు తగ్గడమే. రైతులు కూరగాయల సాగు అంటేనే భయపడుతున్నరు. యాసంగిలనైతే అసలే పెడ్తలేరు. మునుపు యాసంగిలో 20-25 వేల ఎకరాలల్ల కూరగాయలు పెట్టేది. ఇప్పుడు 2 వేల ఎకరాలు సుతం పెడ్తలేరు. నా అసోంటి రైతులు ఎక్కన్నో ఒకకాడ వెడితే ఎండలు కొట్టి దిగుబడి తగ్గి పోయింది. ఇప్పుడు పెట్టే పంట వచ్చే వరకు ధరలు ఇట్లనే ఉంటయని అనుకుంటున్న.
– గాండ్ల శ్రీనివాస్, కూరగాయల రైతు