రామగుండం : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు( Panchayat Elections ) స్వేచ్ఛయుత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిందని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
పెద్దపల్లి జోన్ పరిధిలో పాలకుర్తి , అంతర్గం , జూలపల్లి , ధర్మారం మండలాలలో 73 గ్రామపంచాయతీలు, మంచిర్యాల జోన్ పరిధిలో బెల్లంపల్లి , కన్నేపల్లి , భీమిని, తాండూర్, నేన్నెల, కాసిపేట్, వేమనపల్లి మండలాల్లో 114 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరుగబోతున్నాయని వివరించారు.
ఇద్దరు డీసీపీలు, ఏసీపీలు ఏడుగురు, 30 మంది సీఐలు, 95 మంది ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు , హోం గార్డులు, ఆర్మూడ్ సిబ్బంది , క్యూఆర్ టీమ్స్,రూట్ మొబైల్ పార్టీలు మొత్తంగా 1,700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే అనుమానిత వ్యక్తులను బైండోవర్ చేశామని, చెక్ పోస్ట్‌లను ఏర్పాటు చేసి భద్రత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఏర్పడితే, స్థానిక పోలీస్, డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.