మంథని/మంథని రూరల్/సుల్తానాబాద్/ జూలపల్లి/పెద్దపల్లి రూరల్/ చందుర్తి/ ఇల్లంతకుంట/కథలాపూర్/శంకరపట్నం జూన్ 2: పొద్దంతా ఎండ దంచికొట్టగా ఆదివారం సాయంత్రం ఆకస్మాత్తుగా ఈదురుగాలులతో వర్షం కురిసింది. రోడ్లపై చెట్లు, స్తంభాలు విరిగిపడడంతో కరెంట్ సరఫరాకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఉప్పట్లలో బిరుదు సత్తయ్య ఇంటిపై తాటిచెట్టు పడడంతో నేలమట్టమైంది.
జూలపల్లిలో గాలి దుమారానికి ఓ ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ముత్తారం, మండలంలోని అడవిశ్రీరాంపూర్లో తాటి, కొబ్బరిచెట్లపై పిడుగులు పడడంతో మంటలు చెలరేగాయి.పెద్దపల్లి మండలం హన్మంతునిపేట, భోజన్నపేట శివారులో చెట్లు విరిగిపడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం నర్సింగాపూర్లో తాటిచెట్టుపై పిడుగుపడ్డది.
ఇల్లంతకుంట మండలం వంతడుపులలో ఓ చెట్టు విరిగిపడ్డది. రేకుల షెడ్డు కుప్పకూలింది. కథలాపూర్ మండలం సిరికొండలో అమీర్ రైస్మిల్లుపై గల రేకులు ఎగిరిపోయాయి. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని పలు గ్రామాల్లో సాయంత్రం ఆకస్మాత్తుగా భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వృక్షాలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది.