కార్పొరేషన్, జనవరి 11: నగరంలో మంగళవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మబ్బులు కమ్ముకోగా సాయంత్రం ఒక్కసారి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జ్యోతినగర్, రాంనగర్, విద్యానగర్, భగత్‌నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు నిలిచింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
ముకరంపుర, జనవరి 11: నగరంలోని పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు విద్యుత్ సరఫరాకు ఆటంకంగా మారాయి. ఆర్టీసీ వర్క్‌షాప్ నుంచి మొదలుకొని ఎన్టీఆర్ విగ్రహం వరకు, బొమ్మకల్ ఫ్లైఓవర్ ప్రాంతం, వాణిజ్య సముదాయ ప్రాంతాల్లోని భారీ హోర్డింగ్‌లు, ప్రైవేట్ సంస్థలకు చెందిన ఫ్లెక్సీలు ఈదురు గాలులకు కొట్టుకుపోయి, సమీపంలోని ప్రధాన విద్యుత్ లైన్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. నగరంలో అంధకారం నెలకొనడంతో సెక్షన్ల వారీగా విద్యుత్ సిబ్బంది తీగలపై పడిన ఫ్లెక్సీలను తొలగించి, రాత్రి 9 గంటల వరకు సరఫరాను పునరుద్ధరించారు.
గంగాధర, జనవరి 11: మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. వడగండ్ల వానకు మామిడి పూత రాలిపోయి నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
కరీంనగర్ రూరల్, జనవరి 11: కరీంనగర్ రూరల్ మండలం నగునూర్, ఎలబోతారం, జూబ్లీనగర్, చామనపల్లి గ్రామాల్లో వడగళ్ల వాన కురిసింది. బొమ్మకల్, గోపాల్పూర్, ఇరుకుల్ల, నల్లగుంటపల్లి, చేగుర్తి, మందులపల్లి, మొగ్దుంపూర్, ఫకీర్ఫేట, బహ్దూర్ఖాన్పేట, చెర్లభూత్కూర్ గ్రామాల్లో కూరగాయల తోటలు వర్షానికి దెబ్బతిన్నాయి.