Heavy rain | కోల్ సిటీ , మే 21: గత రెండు రోజులుగా తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం ఒక్క సారిగా వాతవారణం చల్లబడింది. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుల మోతతో ప్రజలను భయకంపితులను చేసింది. దాదాపు గంట పాటు భారీ శబ్దంతో కూడిన పిడుగులు చుట్టు ప్రక్కల ప్రాంతాలలో పడిన సంఘటన ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు.
ఆకాల వర్షంతో నగరంలోని ప్రధాన రోడ్లు, పలు ప్రాంతాలు జలమయం కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దిగువ ప్రాంతాలలో ఇళ్లలోకి వరదనీరు పోటెత్తడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలతో రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం కురిసిన అకాల వర్షంతో కొంత ఊరట కలిగించినా, పిడుగుల మోతలతో ఉల్లిక్కిపడ్డారు. మధ్యాహ్నం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడటంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.