గంగాధర మండలంలోని మంగపేట సమస్యల వలయంలో చిక్కుకున్నది. మండల కేంద్రానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నా.. ఓ వైపు నారాయణపూర్ రిజర్వాయర్, మరో వైపు రైల్వే ట్రాక్, ఇంకో వైపు కాలువ ఈ గ్రామానికి శాపంగా మారాయి. నారాయణపూర్ రిజర్వాయర్ వరద నీరు ఈ గ్రామాన్ని ముంచెత్తుతుంటే, రైల్వే ట్రాక్ ఊరికి దారిలేకుండా చేసింది. ముంపు పరిహారం సరిగా అందక, చుట్టుముట్టిన కష్టాలతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
గంగాధర, జూలై 26 : మంగపేట ఓ చిన్న గ్రామం. సుమారు వెయ్యి జనాభా. గ్రామానికి ఓ వైపు ఎల్లమ్మ చెరువు ఉండగా, పంటలు సాగు చేసుకోడానికి ఈ చెరువే ఆధారం. ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా 2004లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నారాయణపూర్ రిజర్వాయర్‌కు అంకురార్పణ చేసి ఎల్లమ్మ చెరువును రిజర్వాయర్‌లో విలీనం చేసింది. ఆ తర్వాత పాలకులెవరూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు. 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రిజర్వాయర్‌పై దృష్టి సారించింది. 2016 అక్టోబర్ 15న మొదటిసారి నారాయణపూర్ రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసింది. అంతేకాకుండా మంగపేటలో అధికారులు సర్వే చేసి 86 ఎకరాలు, చెరువు కట్ట కింద మరో 19.5 ఎకరాల వ్యవసాయ భూమి, 9 ఇండ్లు ముంపునకు గురవుతున్నట్టు గుర్తించారు.
వ్యవసాయ భూములకు ఎకరానికి 20 లక్షల 20 వేల చొప్పున 90 శాతం పరిహారం చెల్లించారు. 11 ఇండ్లకు వాటి విలువ ప్రకారం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద కుటుంబంలోని 18 ఏళ్లు పైబడిన వారికి 7 లక్షల 20 వేలు పరిహారం ప్రకటించారు. అందుకు 35 కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా వేశారు. అయితే, ఈలోగా ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో పరిహారం విషయం మరుగున పడిపోయింది. వానకాలం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని వదిలిన సమయంలో రిజర్వాయర్ నిండి వరద నీరు సగం గ్రామం వరకు వస్తున్నది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మంగపేట గ్రామాన్ని ఆనుకునే మరోవైపు గంగాధర రైల్వే స్టేషన్ ఉంది. దీని నిర్మాణం కోసం ఈ గ్రామస్తులు భూములు కోల్పోయారు. అయితే, భూములు వదులుకున్న గ్రామస్తులకు రైల్వే లైన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రాకపోకలు లేకుండా, కనీసం దారి లేకుండా చేసింది. రైల్వే స్టేషన్ పట్టాలకు ఇవతలి వైపు గ్రామ పంచాయతీ కార్యాలయం, అవతలి వైపు మొత్తం గ్రామం ఉండడం గ్రామస్తులు శాపంగా మారింది. గతంలో మంగపేటకు వెళ్లడానికి దారి ఉండగా కేవలం 5 నిమిషాల్లోనే మండల కేంద్రానికి చేరుకునేందుకు అనువుగా ఉండేది. రైల్వే స్టేషన్‌ను ఆనుకొని పొడవాటి గోడను నిర్మిస్తుండడం, స్టేషన్ వద్ద తాత్కాలికంగా నిర్మించిన ఫ్లైఓవర్‌ను కేవలం ద్విచక్రవాహనాలు వెళ్లడానికి మాత్రమే పరిమితం చేయడంతో భవిష్యత్తులో గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిపోతాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి నిర్మించాలని కోరినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలి. గ్రామంలో కేవలం 9 ఇండ్లను మాత్రమే ముంపు కింద తీసుకున్నారు. రిజర్వాయర్ నిండిన సమయంలో సగం గ్రామంలోకి నీరు వచ్చి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లకు పరిహారం అందలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 16 కోట్ల పరిహారం చెల్లించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు పరిహారం గురించి మాట్లాడడం లేదు.
– తోట మహిపాల్, గ్రామస్తుడు
గ్రామానికి ఆనుకుని రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేయడంతో దారి కష్టాలు మొదలైనయ్. గ్రామం నుంచి సరైన దారిలేక ఇబ్బంది పడుతున్నాం. పట్టాలకు అడ్డుగా గోడ కడుతుండడంతో దారి పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉన్నది. తాత్కాలికంగా నిర్మించిన వంతెన టూవీలర్స్ వెళ్లడానికి మాత్రమే పనికివస్తోంది. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు.
– భైరి గంగారెడ్డి, గ్రామస్తుడు
20 ఏండ్లుగా మేం ముంపు కష్టాలను ఎదర్కొంటున్నాం. ఓ వైపు నారాయణపూర్ రిజర్వాయర్, మరో వైపు రైల్వే స్టేషన్ మా కష్టాలకు పరీక్షలు పెడుతున్నాయి. ముంపు కింద తీసుకున్న భూములకు పూర్తిస్థాయిలో పరిహారం అందలేదు. ఇండ్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో పరిహారం అందజేయాలి. అలాగే, రైల్వే స్టేషన్ వద్ద బ్రిడ్జి నిర్మించి ప్రయాణ కష్టాలను తీర్చాలి.
– లింగాల దుర్గయ్య, గ్రామస్తుడు