పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సిన పలువురు ఉపాధ్యాయులు అడ్డదారులు తొక్కుతున్నారు. అన్ని అవయవాలు సరిగ్గానే ఉన్నా లేని వైకల్యాన్ని నటిస్తూ.. సర్కారు రాయితీలకు ఎసరు పెడుతున్నారు. బోగస్ వైకల్య ధ్రువీకరణ పత్రాలు పెట్టి అలవెన్సులే కాదు, వక్రమార్గంలో ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు పొందుతున్నారు. ఇలాంటి పంతుళ్ల సంఖ్య నానాటికీ పెరుగుతుండగా, అర్హులైన దివ్యాంగ టీచర్లు అన్ని రకాలుగా నష్టపోతున్నారు. ప్రధానంగా పదోన్నతులు, బదిలీల్లో భారీగా అవకాశాలను కోల్పోతున్నారు.
గతంలో వచ్చిన ఫిర్యాదుల మేరకు అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ క్యాంపులు నిర్వహించి.. 127 మంది బోగస్‌గా ఉన్నట్టు తేల్చారు. ఆ తర్వాత అధికారుల నిఘా లోపంతో మరికొంత మంది బోగస్ సర్టిఫికెట్లు పెట్టి భారీగా ప్రయోజనాలు పొందుతూనే ఉన్నారు. తాజాగా ఓ ఉపాధ్యాయుడిపై హెచ్ఎం ఇచ్చిన ఫిర్యాదుతో మళ్లీ ఈ బాగోతం వెలుగులోకి రాగా, ఎట్టకేలకు కరీంనగర్ జిల్లా విద్యాధికారి విచారణకు ఆదేశించారు. దీంతో మరోసారి బోగస్ వైకల్య పత్రాల దందా తెరపైకి రావడం ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని, అర్హులను గుర్తించి బోగస్‌కు అడ్డుకట్ట వేయాలనే డిమాండ్ వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు కల్పిస్తున్నాయి. ఇవి పొందాలంటే నిబంధనల ప్రకారం 40 శాతం వైకల్యం ఉండాలి. అర్హులైన ఉద్యోగులకు వైకల్య భత్యం కింద ఆరంభంలో నెలకు 900 ఇవ్వగా.. 2015 జూలై ఒకటి నుంచి ఆ మొత్తం 2వేలకు పెరిగింది. ఆ తర్వాత 2023 జూలై 22 నుంచి జీవోనంబర్ 58 ద్వారా ఈ అలవెన్స్‌ను ప్రభుత్వం 3వేలకు పెంచింది.
దీంతో పాటు సంబంధిత ఉపాధ్యాయులకు ఏటా ఆదాయపన్ను 75వేల నుంచి లక్షా 25వేల వరకు మినహాయింపు లభిస్తున్నది. అలాగే వృత్తిపన్ను మినహాయింపు కూడా కొంత మేరకు వర్తిస్తున్నది. ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లలో ప్రిఫరెన్షియల్ కోటా కింద ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. ఆర్టీసీ, రైల్వే ప్రయాణంలో 50 శాతం వరకు రాయితీ, వంటి పలు సదుపాయాలను కల్పిస్తున్నది. ఇటువంటి రాయితీలను పొందేందుకు పలువురు పంతుళ్లు లేని వైకల్యం చూపుతున్నారు. బోగస్ సర్టిఫికెట్లు పెట్టి అలవెన్స్‌లు క్లెయిమ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని మెజార్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బోగస్ వైకల్య పత్రాలు పెట్టి రాయితీలు పొందుతున్నారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 2016లో జిల్లా వికలాంగుల, ఉద్యోగుల హక్కుల పోరాట సమితి నాయకులు ఆనాటి కలెక్టర్ నీతూప్రసాద్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఆ మేరకు రంగంలో దిగిన కలెక్టర్, ముందుగా ఆయా శాఖల నుంచి వివరాలు తెప్పించి, ఈ కోటా కింద ఎక్కువగా విద్యాశాఖలో 468 మంది టీచర్లు రాయితీలు పొందుతున్నట్టు గుర్తించారు.
సదరు ఉపాధ్యాయులంతా గతంలో మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్లను పక్కన పెట్టి వైకల్య అర్హత గుర్తించేందుకు ప్రవేశపెట్టిన సదరం (సాఫ్ట్వేర్ ఫర్ అసెస్మెంట్ ఆఫ్ డిసెబుల్డ్ ఫర్ అక్సెస్ రీహాబిలేటేషన్ అండ్ ఎంఫవర్మెంట్) సర్టిఫికెట్ తీసుకోవాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆనాడు నాలుగు దశల్లో క్యాంపులు నిర్వహించి, అలవెన్స్‌లు క్లెయిమ్ చేస్తున్న వారిలో 127 మంది పంతుళ్లకు వైకల్యం లేదని గుర్తించారు. పెద్దమొత్తంలో బయటపడిన వివరాలను కలెక్టర్.. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించారు.
బోగస్‌ను తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ కమీషనర్.. సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు తీసుకున్న భత్యాన్ని రికవరీ చేసి ఆ మొత్తాన్ని ట్రెజరీలో జమచేయాలని, బోగస్ పత్రాల ఆధారంగా ఎవరైనా పదోన్నతులు, బదిలీలు ఇతరత్రా లబ్ధిపొందితే ఆ వివరాలు సేకరించి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. బోగస్ వైకల్య ధ్రువీకరణ పత్రాలు పెట్టడం క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఈ లెక్కన క్రమశిక్షణ రూల్ 20 ప్రకారం ఎందుకు సదరు ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోరాదో పేర్కొంటూ షోకాజ్ నోటీసులు జారీ చేసి, వారి నుంచి పది రోజుల్లో లిఖిత పూర్వక వివరణ తీసుకోవాలని ఆ నాటి విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు విద్యాశాఖ కొన్ని చర్యలు చేపట్టగా.. కొంతమంది కోర్టుకు వెళ్లారు. ఆ తర్వాత వచ్చిన అధికారులు.. దీనిపై పెద్దగా దృష్టి పెట్టలేదు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఒక ఉపాధ్యాయుడు బోగస్ వైకల్య పత్రాలను పెట్టి.. అలవెన్స్‌లు పొందుతున్నారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ ఓ ప్రధానోపాధ్యాయుడు కరీంనగర్ జిల్లా డీఈవోకు లిఖతపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. నిజానికి హెచ్ఎం ఫిర్యాదు విషయంలో ఆలస్యం జరిగినా డీఈవో ఎట్టకేలకు స్పందించి విచారణకు (ఆర్.నంబర్ 1034/ఎ1/2024) ఆదేశించారు. వారం రోజుల్లో విచారణ నివేదిక అందించాలని అందులో స్పష్టం చేశారు. నిబంధల ప్రకారం సదరం జారీ చేసిన వైకల్య పత్రాలను మాత్రమే జతచేయాలి.
కానీ, సదరు ఉపాధ్యాయుడు నేటికి గతంలో మెడికల్ బోర్డు జారీ చేసిన పత్రాన్ని పెట్టి అలవెన్స్‌లు యథేచ్ఛగా పొందుతున్నాడని, ఆ ఉపాధ్యాయుడికి కేవలం 40 శాతం మాత్రమే వైకల్యం ఉందని, ఏ కోణంలో చూసిన అర్హుడు కాదని హెచ్ఎం తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫిర్యాదుపై డీఈవో స్పందించడంతో మళ్లీ బోగస్ అంశం తెరపైకి వచ్చింది. ఈ తరహా బాగోతం కేవలం ఒక ఉపాధ్యాయుడికి మాత్రమే పరిమితం కాలేదు, చాలా మంది టీచర్లు నేటికి సదరం జారీచేసిన సర్టిఫికెట్లు కాకుండా గతంలో మెడికల్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ల ఆధారంగానే అలవెన్స్‌లు పొందుతున్నారు. ఉమ్మడి జిల్లాలోప్రస్తుతం 1680 మందికిపైగా ఈ తరహా అలెవెన్స్‌లు పొందుతున్నట్టుగా తెలుస్తున్నది.
మెడికల్ బోర్డు జారీ చేసిన వైకల్య సర్టిఫికెట్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, డబ్బులు ఇస్తే లేని వైక ల్యం ఉన్నట్టు సర్టిఫికెట్లు ఇస్తున్నారనే ఆరోపణలు రావడం తో ఆనాటి ప్రభుత్వం సదరంను తెరపైకి తెచ్చింది. ప్రతి ఉద్యోగి సదరం నుంచి పొందిన సర్టిఫికెట్ సమర్పించాలి. కానీ, నేటికి చాలా మంది మెడికల్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ పైనే అలవెన్స్‌లు పొందుతున్నారంటే.. వీటిని ప్రతినెలా పరిశీలించాల్సిన అధికార యంత్రాగం నిద్రపోతున్నదని స్పష్టమవుతున్నది. కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు గుర్తించినా సంఘాల ఒత్తిడితో పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. నిజానికి 2018 జూలైలో జరిగిన బదిలీల సమయంలో బోగస్ వైకల్య పత్రాల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అప్పుడు దీనిపై దాదాపు అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఒక్కటై జేఏసీ ఏర్పాటు చేసుకొని బోగస్ పత్రాలను తొలగించడమే కాకుండా, ఇప్పటికే కొనసాగుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు లిఖితపూర్వంగా ఫిర్యాదు చేశాయి. ఆ మేరకు చర్యలు తీసుకుంటామని, క్యాంపులు నిర్వహిస్తామని చెప్పినా నాటి విద్యాధికారులు.. ఎటువంటి చర్యలు తీసుకోకుండానే చేతులు దులుపుకొన్నారు. నిజానికి ఈ తరహా దందాతో అర్హత ఉన్న ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల సమయాల్లో అన్యాయం జరుగుతున్నది. వైకల్యం సర్టిఫికెట్లు ఉన్న వారికి ప్రిఫరెన్షియల్ కేటగిరి కింద రిజర్వేషన్లు ఇవ్వడంతో.. మంచి పోస్టులన్నీ అనర్హులకే దక్కుతున్నాయనే విమర్శలున్నాయి.
నిజానికి అర్హత ఉన్నవారికి దక్కితే తప్పు కాదు కానీ, బోగస్ సర్టిఫికెట్లు పొందిన వారు భారీగా లబ్ధిపొందుతున్నారు. అలాగే వివిధ అలవెన్స్లతో ప్రభుత్వ ఖాజానాకు గండి పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అనేది పకడ్బందీగా నిర్వహించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉండగా.. సదరు ఉపాధ్యాయుడిని కాపాడేందుకు ఒకటి రెండు ఉపాధ్యాయ సంఘాలు ఉన్నతాధికారులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో డీఈవో సదరు టీచర్‌పై చర్యలు తీసుకుంటారా..? లేదా..? అన్నది వేచిచూడాల్సి ఉన్నది. అయితే ఈ విచారణ కేవలం ఒక్కరికి మాత్రమే పరిమితం చేయకుండా, ఉమ్మడి జిల్లాలో మరోసారి క్యాంపు నిర్వహించి, అనర్హులను తొలగించాల్సిన అవసరమున్నదనే డిమాండ్ ఉప్యాధ్యాయుల నుంచి వస్తున్నది. అప్పుడే అర్హత ఉన్న టీచర్లకు అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నది.