కొత్తపల్లి, డిసెంబర్ 19: కరీంనగర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా నాలుగుసార్లు గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని, తుదిశ్వాస వరకూ వారి సేవలోనే తరిస్తానని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మె ల్యే గంగుల కమలాకర్ భరోసానిచ్చారు. కొత్తపల్లి ఎంపీపీ పిల్లి శ్రీలతా మహేశ్ అధ్యక్షతన మంగళవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆయన హాజరై మాట్లాడారు. పదిహేనేండ్ల కాలంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా కరీంనగర్ నియోజకవర్గాన్ని గొప్ప గా అభివృద్ధి చేశానని, బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయాన్ని పండుగ చేశామని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తామని సర్కారు పది రోజులు గడుస్తున్నా చేసిందేమీలేదన్నారు. రైతుబంధు కూడా పూర్తిగా ఇవ్వలేదని ఆక్షేపించారు.
రైతులు కాంగ్రెస్ వాగ్దానాల అమలు కోసం ఆశతో చూస్తున్నారని చెప్పారు. హామీల అమలుకు 100 రోజులదాకా ఎదురు ఎదురుచూస్తామని, అప్పటి వరకు నెరవేర్చకుంటే నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. బీఆర్ఎస్కు పోరాటాలు కొత్తకాదని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమకాలేదన్నారు. అలాగే బోనస్‌పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి 200 యూని ట్లు రైతులకు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నారు. అధికారులు కొత్త ప్రభుత్వం చేపట్టే పనులతోపాటు పాత ప్రభుత్వం చేపట్టిన పనులను కూడా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జడ్పీటీసీ పిట్టల కరుణ, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షాబీర్ పాషా, ఎంపీడీవో ఏ శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.