రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 5వ డివిజన్‌కు చెందిన ఓ యువకుడు రాజీవ్ యువ వికాసం పథకంలో భాగంగా 2 లక్షల యూనిట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆన్లైన్లో పని చేయకపోవడంతో గడువు పొడిగించిన తర్వాత ఆఫ్‌లైన్‌లో సమర్పించాడు. అనంతరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు సైతం పిలుపు రావడంతో బ్యాంకర్లకు తాను దరఖాస్తు చేసుకున్న యూనిట్ గురించి వివరించాడు. బ్యాంకర్ సైతం రుణం ఇచ్చేందుకు ఓకే అన్నాడు. క్రెడిట్ స్కోర్, బ్యాంక్ ట్రాన్జాక్షన్ చూసిన బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్.. కార్పొరేషన్ నుంచి వచ్చిన జాబితాలో పేరు లేదని చెప్పడంతో ఆందోళనలో చెందాడు ఇదేంటని కార్పొరేషన్ అధికారులను అడిగితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న వాళ్లవి మాత్రమే పంపించామని చెప్పడంతో అవాక్కయ్యాడు. ఒక్క ఈ యువకుడే కాదు.. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వందలాది మంది పరిస్థితి ఇలాగే మారింది.
పెద్దపల్లి, మే 19(నమస్తే తెలంగాణ): రాజీవ్ యువ వికాస్ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధం కాగా, వరుస సెలవులు రావడంతో ఆన్లైన్ ప్రక్రియ పూర్తి కాలేదు. ఏప్రిల్ 14 తర్వాత ఆన్లైన్ పనిచేయకపోవడంతో ప్రభుత్వం అదే నెల 24వ తేదీ వరకు ఆఫ్‌లైన్ ద్వారా స్వీకరించింది. దీంతో పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలతోపాటు ఆయా మండలాల ఎంపీడీఓ కార్యాలయాల్లో వందల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. తీరా చూస్తే ప్రభుత్వం ఆన్లైన్ దరఖాస్తుదారుల సంఖ్య మాత్రమే చెబుతున్నది. ఆఫ్‌లైన్ లెక్కలు చెప్పకపోవడంపై అనుమానాలకు తావిస్తున్నది. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే ఆఫ్‌లైన్‌లో వెయ్యికి పైగా వచ్చిన దరఖాస్తుల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. జూన్ ఒకటి కల్లా యూనిట్ల మంజూరు పత్రాలను సిద్ధం చేయాలని అధికారులు చెప్పడంతో ఆఫ్‌లైన్ దరఖాస్తుదారుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఆఫ్‌లైన్ దరఖాస్తులను సైతం పరిగణలోకి తీసుకుంటున్నామనే నమ్మకం కలిగేలా అధికారులు జిల్లాలో నిర్వహించిన దరఖాస్తుల పరిశీలనకు ఆన్లైన్, ఆఫ్‌లైన్ వారందరినీ పిలిచారు. దీంతో ఆఫ్‌లైన్ దరఖాస్తుదారులకు ఎలాంటి అనుమానం రాలేదు. తాజాగా ఒక్కో దరఖాస్తుదారుడికి తాము పెట్టుకున్న బ్యాంకు నుంచి పిలుపు వచ్చింది. వారి సిబిల్ స్కోర్, ఇతర బ్యాంకు లావాదేవీలను పరిగణలోకి తీసుకొని ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ సమయంలో ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎలాంటి పిలుపు రాలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా దాదాపుగా వెయ్యి మంది వరకు నష్టపోయే ప్రమాదం ఏర్పడగా, దరఖాస్తు చేసుకున్న వారంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందే స్పష్టత ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెబుతున్నారు.