కరీంనగర్ రూరల్, డిసెంబర్ 14: మండలంలోని దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మాణానికి సీఎం కేసీఆర్ రూ. కోటి 86 లక్షలు మంజూరు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సీఎం కేసీఆర్, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ కటౌట్లకు సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉపసర్పంచ్ మాట్లాడుతూ, కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.మండలంలోని 13 గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి రూ. 43 కోట్లు మంజూరు చేయించిన ఘనత మంత్రి గంగుల కమలాకర్కే దక్కుతుందన్నారు. దుర్శేడ్ నుంచి గుంటూర్పల్లి వరకు రోడ్డు నిర్మిస్తే స్థానికులకు, రైతులకు ఇబ్బందులు తీరుతాయని తెలిపారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, ఇందుకు కృషి చేసిన మంత్రి గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు శ్రీ రామోజు తిరుపతి, కరీంనగర్ రూరల్ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు నేరేళ్ల శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ గాజుల అంజయ్య, బీఆర్ఎస్ నాయకులు రాజ్‌కమల్, పూదరి మహేశ్‌గౌడ్, నేరేళ్ల మహేశ్, తిరుపతి, కిట్టు, లక్ష్మణ్, దుర్శేడ్ గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.