జగిత్యాలలో మరోసారి రైతులు కదం తొక్కారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ మరో ఉద్యమానికి నాంది పలికారు. మంగళవారం కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కల్వకుంట్ల చేపట్టిన రైతు పాదయాత్రకు వేలాదిగా తరలివచ్చి, కోరుట్ల నుంచి జగిత్యాల దాకా ఉత్సాహంగా కదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు.
జగిత్యాల, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ)/కోరుట్ల : రైతు సమస్యల పరిష్కారం కోసం కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల కోరుట్ల – జగిత్యాల రైతు పాదయాత్ర చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాదయాత్రను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులతో కలిసి ముందుకుసాగారు. ఈ యాత్ర వెంకటాపూర్, మోహన్‌రావుపేట, మేడిపల్లి, తాటిపల్లి, చల్గల్ మీదుగా జగిత్యాలకు కదలగా.. ఊరూరా రైతులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. మేడిపల్లిలో జాతీయ రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సంజయ్ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు.
మేడిపల్లి శివారు పీఎన్ఆర్ గార్డెన్లో రైతులు, యువకులతో కలిసి ఎమ్మెల్యే మధ్యాహ్న భోజనం చేశారు. ఆ సమయంలోనే కొంత సేపు స్వయం గా ఫిజియోథెరపీ చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి కదిలి ముందుకెళ్లగా, చల్గల్ వద్ద మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్వయంగా రైతు పాదయాత్రకు ఎదురెళ్లి సంజయ్‌కి స్వాగతం పలికారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, తదితరులు చేరుకొని ఆహ్వానించారు. రైతుల ఉత్సాహం చూసిన మాజీ మంత్రి గంగుల కమలాకర్ స్వయంగా రైతులను కూర్చొబెట్టుకొని ట్రాక్టర్ నడిపారు. అక్కడి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న జగిత్యాలకు రైతుల పాదయాత్ర సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేరుకోగా, మంచినీళ్ల బావి వద్ద బీఆర్ఎస్ నాయకులతోపాటు రైతులు స్వాగతం పలికారు. కొత్తబస్టాండ్ వద్దకు చేరుకున్న హరీశ్‌రావు, ఎమ్మెల్యే సంజయ్, దావ వసంత తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు.
అనంతరం మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్యేలు, నాయకులను రైతులు, కార్యకర్తలు వరిగొలకలతో చేసిన గజమాలతో సత్కరించారు. ఆ తర్వాత హరీశ్‌రావు, సంజయ్ కల్వకుంట్ల, గంగుల కమలాకర్, ఎల్ రమణ, కొప్పుల ఈశ్వర్, విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్, రాజేశంగౌడ్, కొండూరి రవీందర్రావు, దావ వసంత కలెక్టరేట్‌కు వెళ్లి రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. యాత్ర సు మారు 25 కిలోమీటర్లు సాగగా, దారిపొడవునా రైతులు ఉత్సాహంగా కదిలారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ‘కాంగ్రెస్ డౌన్ డౌన్’, ‘రేవంత్ నాటకం.. రుణమాఫీ బూటకం’, ‘మోసానికి కేరాఫ్ కాంగ్రెస్.. దగాకు చిరునామా రేవంత్’ ‘కొర్రీలొద్దు, కోతలొద్దు.. ఆంక్షల్లేని రుణమాఫీ కావాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కొత్త బస్టాండ్ వద్ద హరీశ్‌రావు తన ప్రసంగంతో నూతనోత్సాహం నింపారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలు, హామీల అమలులో చేసిన దగాను ఎండగట్టారు. వెన్నెముక శస్త్ర చికిత్స చేసే డాక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న సంజయ్ దేశానికి వెన్నెముక అయిన రైతుల కోసం 25 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం అభినందనీయమని కొనియాడారు.
జగిత్యాల జిల్లాలో ప్రారంభమైన రైతుల పాదయాత్ర సీఎం రేవంత్‌రెడ్డికి ట్రైలర్ మాత్రమేనని, ము న్ముందు 70 ఎంఎం సినిమా ఉంటుదని హెచ్చరించారు. అబద్ధపు హామీలు, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి పాలన రైతుల పాలిట శాపంలా మా రిందని ఆందోళన వ్యక్తం చేశారు. బోనస్ బోగస్ అయిందని, రైతుబంధు రాదని, రుణమాఫీ కాదని మండిపడ్డారు. తనకు ఎమ్మెల్యే పదవి కంటే 60 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావడమే ముఖ్యమని, వారి కోసం రాజీనామాకు సిద్ధమని స్పష్టం చేశారు. హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రసంగిస్తున్నంత సేపు రైతులు ఉత్సాహంగా విన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టినప్పుడల్లా చప్పట్లతో హోరెత్తించారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తన మాట, పాటతో ఉర్రూతలూగించారు. రైతుబంధు గోవిందా.. వరి బోనస్ గో విందా..కల్యాణలక్ష్మి గోవిందా.. షాదీముబారక్ గో విందా.. అంటూ రేవంత్ సర్కార్‌పై తనదైన శైలిలో పాటలతో విమర్శలు గుప్పించారు.
పాదయాత్ర విజయవం తం కావడంతో గులాబీ శ్రేణుల్లో సమరోత్సాహం నిండిం ది. రైతులు స్వచ్ఛందంగా పెద్దసంఖ్యలో పాల్గొనడం, రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా కదంతొక్కడం చూసి ప్రజలు మరో పోరాటానికి సిద్ధమయ్యారనే నమ్మకం కనిపించింది. మొత్తంగా ఈ రైతు పాదయాత్ర ఒక ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని రగిలించిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఈ పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్టమధూకర్, మాజీ మంత్రి రాజేశంగౌడ్, నాఫ్స్ కాబ్ మాజీ చైర్మన్ కొండూరి రవీందర్రావు, మా జీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బేవరేజేస్ సంస్థ మా జీ చైర్మన్ దేవిప్రసాద్, జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ మేమర్ సునీల్ రావు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, దావ సురేశ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రైతుల కోసం తగ్గేది లేదు
కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ. ఎన్నికల ముందు దొంగమాటలు చెప్పి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తదో చెప్పాలి. రైతే దేశానికి వెన్నెముక అని అంటుంటాం. అలాంటి రైతులు గోసపడితే రాజ్యం బాగుంటుందా..? ఆలోచించాలి. ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. మమ్మల్ని కొట్టినా, చంపినా వెనక్కి మాత్రం తగ్గేది లేదు. సీఎం రేవంత్ రెడ్డి సంస్కార హీనుడు. హామీల అమలుపై చిత్తశుద్ధి ఉందా..? ఉంటే అమలు చేసి చూపించాలి. నేను పాదయాత్ర చేస్తుంటే స్థానిక కాంగ్రెస్ నాయకులు ఎన్నికలు ఇప్పుడు ఉన్నాయా..? అని మాట్లాడుకుంటున్నరు. నా పాదయాత్ర రాజకీయాల కోసం కాదు. రైతు కష్టాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకే పోరుబాట పట్టా. భవిష్యత్తులో వందలాది పాదయాత్రలు చేస్తా. ప్రభుత్వాన్ని ఎండగడతా. ప్రజల ముందు ప్రభుత్వాన్ని నిలబెడతా. అవసరమైతే రైతుల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతా.
– డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే
కాపాడాల్సిన బాధ్యత మాపై కూడా ఉన్నది
కొట్లాడి రాష్ర్టాన్ని తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడాల్సిన బాధ్యత కూడా మాపై ఉంది. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా. 30 ఏండ్ల రాజకీయంలో ఉన్నా. వైఎస్ హయాంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో విలువలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. పండవెట్టి తొక్కుతా..? పేగులు మెడలో వేసుకుంటానన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు విచిత్రంగా, అసహ్యంగా ఉన్నాయి. మరో మంత్రి బాంబులు వేస్తామనడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు బోనస్ ఎంఎస్పీ కూడా ఇవ్వడం లేదు. ప్రజాసమస్యలు వదిలి, రాష్ట్ర మంత్రులు దుకాణాలు తెరుచుకున్నరు. మంత్రులు హైదరాబాద్‌ను విడిచి కల్లాలకు వెళ్లి చూస్తే వారి సమస్యలు తెలుస్తయి.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే
ఇది అంతం కాదు.. ఆరంభం
కాంగ్రెస్ సర్కారు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెక్కింది. కానీ ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు చేసిన పాపాన పోలేదు. ఎన్నికల హామీలను నెరవేర్చాలని, రైతుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని కోరుట్ల ఎమ్మెల్యే సంజ య్ పాదయాత్ర చేయడం అభినందనీ యం. ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. రానున్న కాలం అంతా పోరాటమే. నయవంచక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాటం తప్పదు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రైతు భరోసా, రుణమాఫీ, బోనస్ కచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి ఏడపన్నడు? ఏ మూలన పన్నడో..? చెప్పాలి.
– కొప్పుల ఈశ్వర్, మాజీ మంత్రి
పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది..
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి మోసం చేసింది. రైతులను ఇబ్బందులు పెడుతున్నది. ఈ సమయంలో రైతుల సమస్యలపై కోరుట్ల ఎమ్మెల్యే చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలుస్తుంది. సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. రైతులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమైనా కాలగర్భంలో కలిసిపోతుంది. ఇప్పటికైనా ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి.
– ఎల్ రమణ, ఎమ్మెల్సీ
కడుపు రగిలి రైతన్న రోడ్డెక్కిండు
గుండె పగిలి, కడుపు రగిలి రోడ్డెక్కిన రైతన్నలకు అభినందనలు. రైతుల పోరాటం చూస్తే ముచ్చట వేస్తున్నది. సీఎంకు యోగాలు, పీఎంకు బోగాలు, హైడ్రాతో రోగాలు, అవినీతి రోదనలు రాష్ట్రవ్యాప్తంగా వినిపిస్తున్నయి. తెలంగాణలో కూలిన వ్యవసాయాన్ని కేసీఆర్ నిలబెట్టిండు. 24 గంటల కరెంట్ ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టించిండు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించిండు. కేసీఆర్ అంటే రైతులకు ప్రేమ ఉంది. కానీ కాంగ్రెస్ దొంగ హామీలు నమ్మి నట్టేట మునిగారు. 2018 నుంచి 2023 వరకు రైతు బంధు ఎప్పుడూ ఆగలేదు. కరోనా కాలంలోనూ రైతు అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. కానీ ఇప్పుడు రైతు బంధుకు డబ్బులు లేవని అంటున్న రేవంత్‌రెడ్డికి, మూసీ ప్రక్షాళనకు 1.50లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలి. అది మూసీ ప్రక్షాళన కాదని, కాంగ్రెస్ భక్షణ అని చెప్పాలి.
– దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్సీ
కాంగ్రెస్ మెడలు వంచుతం
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పోరుబాటకు దిగిండు. ఈ పాదయాత్ర ఎవరూ చేయమన్నది కాదు. మార్పు మార్పు అంటూ కాంగ్రెస్ సర్కారు రైతులను నిండా ముంచింది. రుణమాఫీకి ఎగనామం పెట్టింది. బోనస్‌ను బోగస్ చేసింది. రైతు భరోసాకు మంగళం పాడింది. ధాన్యం కొనుగోళ్లలోనూ ఇబ్బందులు పెడుతున్నది. నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, రైతుల హామీలను నెరవేర్చేదాకా పోరాటం ఆగదు.
– విద్యాసాగర్ రావు, బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు
రైతులు కన్నెర్రజేస్తే కుర్చీ ఊడడం ఖాయం
ఆరు గ్యారెంటీల అమలు ఏమోగానీ, రేవంత్ సీఎం కుర్చీ కాపాడుకునేందుకు కష్టపడుతున్నడు. రైతులు కన్నెర్ర చేస్తే రేవంత్ కుర్చీ ఊడడం ఖాయం. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన రాజ్యం అరిష్టం. రాష్ర్టానికి ఈ అరిష్టం పోవడానికే కోరుట్ల ఎమ్మెల్యే పోరాటం చేస్తున్నరు. కాంగ్రెస్ రైతులను అడుగడుగునా మోసం చేస్తున్నది. నిండా ముంచుతున్నది. కాంగ్రెస్ విధానాలను రైతులు ఎండగట్టాలి. కేసీఆర్‌ను మళ్లీ సీఎంను చేసేదాకా బీఆర్ఎస్ శ్రేణులు విశ్రమించకూడదు.
– దావ వసంత, జడ్పీ మాజీ చైర్పర్సన్
ప్రభుత్వాన్ని బొందపెట్టుడు ఖాయం
కాంగ్రెస్ అబద్ధాలతో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదు. ఆ పార్టీతో వచ్చేదేమీ లేదు. పోయేదేం లేదు. పంటకు పెట్టుబడికి రైతు భరోసా ఇస్తానని ఎగ్గొట్టారు. అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రూ.రెండు లక్షల రుణమాఫీ ఫైల్‌పై సంతకం చేస్తానని రేవంత్‌రెడ్డి నమ్మించి మోసం చేసిండు. 2వేలు ఉన్న పింఛన్‌ను డబుల్ 4వేలు చేస్తానన్నడు. రాష్ట్రంలో ఎవరికైనా ఇస్తున్నడా..? చెప్పాలి. కేసీఆర్ పాలనలో రైతుబంధు, రుణమాఫీ, ఆసరా పింఛన్ ఎన్నడూ ఆగలే. బరాబర్ అందేవి. ప్రపంచ చరిత్రలో రైతు చనిపోతే ఆ కుటుంబానికి 5లక్షలు ఇవ్వడం కేసీఆర్ సర్కారులోనే జరిగింది. కానీ, కాంగ్రెస్ సర్కారు రైతును గోసపెడుతంది. వెంటనే ఇచ్చిన హామీలు అమలు చేయాలి. లేదంటే ప్రభుత్వాన్ని బొందపెట్టుడు ఖాయం.
– సుంకె రవిశంకర్, మాజీ ఎమ్మెల్యే
రేవంత్ పాలన పగ్గాల్లేని ఎడ్లబండి
సీఎం రేవంత్ రైతన్నల నడ్డి విరిస్తే, వెన్నె ముక డాక్టర్ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల దాన్ని సరిచేసి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. రైతుల సమస్యలపై డాక్టర్ సంజయ్ చేసిన పాదయాత్ర రాష్ట్రంలో మొదటిది. ఇలానే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రైతన్నలకు అండగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి పాలన పగ్గాలు లేని ఎడ్లబండిలా మారింది. ఒక ఎద్దు అటు, ఇంకోటి ఇటు అన్నట్లుగా పోతున్నది. రైతులు ధైర్యంగా ఉండండి. హామీలు అమలయ్యేదాకా బీఆర్ఎస్ మీకు వెన్నంటి ఉంటుంది.
– డాక్టర్ చల్మెడ లక్ష్మీనరసింహారావు, బీఆర్ఎస్ వేములవాడ ఇన్చార్జి