కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల గనిగా మారిన సింగరేణిని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ నడుంబిగించింది. నల్లనేల వేదికగా అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌తో కలిసి సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో ఆదివారం ఎన్టీపీసీ వేదికగా ‘సింగరేణి పరిరక్షణ సదస్సు’ నిర్వహించగా, కార్మికలోకం తరలివచ్చింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సింగరేణిలో కాంగ్రెస్ సర్కారు అవినీతి అక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కండ్లముందుంచగా, ఆలోచనలో పడింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంస్థను కాపాడుకున్న తీరును, కాంగ్రెస్ నిర్వీర్యం చేస్తున్న తీరును వివరించగా నిజమేనంటూ మద్దుతు తెలిపింది. కార్మికులు నిజాలు తెలుసుకోవాలని, సింగరేణిని కాపాడుకోవాలని హరీశ్‌రావు పిలుపునివ్వగా, ‘మేమంతా మీ వెంటే ’నంటూ స్పష్టం చేసింది. మళ్లీ కేసీఆర్ వస్తేనే సింగరేణికి మంచిరోజులు వస్తాయని ముక్తకంఠంతో చెప్పింది.

గోదావరిఖని / జ్యోతినగర్, జూన్ 7 : సింగరేణిలో కుంభకోణాలు, కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ బయటపెడుతున్నది. ఇదే సమయంలో నల్లసూర్యులను చైతన్యం చేసి, సంస్థను పరిరక్షించుకునేందుకు పోరుబాట పట్టింది. అందులో భాగంగానే నల్లనేలపై సమరశంఖం పూరించింది. ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో ఆదివారం టీబీజీఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అధ్యక్షతన ఎన్టీపీసీ ఖాజీపల్లిలోని శ్రీమయి ఫంక్షన్‌హాల్ వేదికగా సింగరేణి పరిరక్షణ సదస్సు నిర్వహించింది.
టీబీజీకేఎస్ శ్రేణులతోపాటు వందలాది మంది సింగరేణి కార్మికులు తరలిరాగా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు, మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, పాడి కౌశిక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, పుట్ట మధూకర్ సింగరేణి పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ పాలనలో కుంభకోణాల సింగరేణిగా మారిన తీరును కండ్ల ముందుంచారు. నలభై లక్షల టన్నుల బొగ్గు మాయం, సైట్ విజిటింగ్ స్కాం, సోలార్ స్కాం, ఎక్సోపోజివ్స్ స్కాం ఇతర అవినీతి అక్రమాలపై సమరశంఖం పూరిస్తూ ముందుకు సాగుతామని హరీశ్‌రావు ప్రకటించారు. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి అక్రమాలను అన్ని ఏరియాల్లోని 38 వేల మంది కార్మికులకు అర్థమయ్యే రీతిలో వివరిస్తామని, చైతన్యం చేసి ఎండగడుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన కుంభకోణాలను వేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించడంతో కార్మికులు ఆసక్తిగా తిలకించారు. దాదాపు 2గంటలపాటు సదస్సులో ఓపికగా కూర్చొని, హరీశ్‌రావు చెప్పిన ప్రతి మాటా కరెక్టేనంటూ చేతులెత్తి మద్దతు తెలిపారు. సింగరేణిని కోలుకోలేకుండా చేసి ఏటీఎంగా వాడుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, దానిని అడ్డుకోకుంటే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హరీశ్‌రావు చెప్పగా.. అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని అభివృద్ధి పథంలో నడిపించిందని, కాంగ్రెస్ సర్కార్ సంస్థను అధోగతి పాలు చేస్తున్నదని మండిపడ్డారు. అవినీతి, అక్రమాలతో సింగరేణి సంస్థ మసకబారడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆగ్రహించారు. గోదావరిఖని కేంద్రంగా సమరశంఖం పూరిస్తూ తెలంగాణ గుండెకాయ సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బీఆర్ఎస్ నడుం బిగించడాన్ని మద్దతు తెలిపారు. టీబీజీకేఎస్‌తో కలిసి వచ్చే కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతుండడంపై హర్షం వ్యక్తం చేశారు.

కేసీఆర్ ఉద్యోగాలిస్తే.. రేవంత్ ఊడగొడుతుండు
సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు హయాంలో సింగరేణిలో గోల్డెన్ హ్యాండ్ షేక్ పథకాన్ని తెచ్చి ఉద్యోగాలు ఊడగొట్టిండు. కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే కేసీఆర్ సింగరేణి సంస్థను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిండు. 19వేల మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించిండు. కానీ, ఇప్పుడు చంద్రబాబు బంటుగా ఉన్న రేవంత్‌రెడ్డి కేసీఆర్ ఇచ్చిన డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టేందుకు యత్నిస్తున్నడు. ఉద్యోగాలపై విచారణ చేస్తామని పేర్కొనడం హాస్యాస్పదం. ఇప్పటికే డిపెండెంట్ ఉద్యోగాలను పోగొట్టి మెడికల్ బోర్డులు పెట్టకుండా కార్మికుల నోట్లో మట్టికొడుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై కార్మికులు గుర్రుగా ఉన్నరు. కార్మికులెవరిని అడిగినా ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ అనే నినాదమే చేస్తున్నరు.
– హరీశ్‌రావు, మాజీ మంత్రి
సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టిండు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లలోనే సిరులవేణి సింగరేణిని రేవంత్‌రెడ్డి అప్పుల ఊబిలోకి నెట్టిండు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థ బొగ్గుకు బకాయిలు కేవలం రూ.7,355కోట్లు ఉంటే, అందులో తెలంగాణ ఏర్పడక ముందు రూ.1,958 కోట్ల బకాయి ఉంది. అంటే బీఆర్ఎస్ హయాంలో కేవలం రూ.5వేల కోట్లలోపే బకాయిలు ఉంటే రేవంత్ సర్కారు రెండున్నర ఏళ్లలోనే 12వేల కోట్ల పైచిలుకు బొగ్గ్గు బకాయిలు పెట్టింది. బొగ్గు అమ్మకం ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి ఇస్తుందా..? లేదా..? అనే అనుమానం కలుగుతున్నది. ఓ వైపు బొగ్గు బకాయిలు ఇవ్వకుండా సింగరేణి డబ్బులతో రేవంత్ సర్కారు సోకులకు పోయి మూసీ సుందరీకరణ పేరిట లక్షల కోట్లు, ప్యూచర్ సిటీ పేరుతో మరో లక్ష కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతుండడం సిగ్గుచేటు. సింగరేణి డబ్బులతో జల్సా చేయడం ఎంతవరకు సమంజసమో చెప్పాలి.
– హరీశ్‌రావు, మాజీ మంత్రి

టీబీజీకేఎస్‌తోనే మనుగడ
బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతోనే రానున్న రోజుల్లో సింగరేణికి మనుగడ ఉంటుంది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ కార్మిక సంక్షేమానికి పాటుపడితే రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సింగరేణికి మనుగడ లేకుండా చేస్తున్నది. అనేక కుంభకోణాలతో కార్మికుల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నది.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
కేసీఆరే శ్రీరామరక్ష
బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తొలి సీఎంగా కేసీఆర్ సింగరేణికి శ్రీరామరక్షగా నిలిచారు. అనేక హామీలు అమలు చేసిండు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చారు. సింగరేణి అభివృద్ధికి అనేక చర్యలు తీసుకొంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నిర్వీర్యం చేస్తున్నది. కార్మిక సంక్షేమాన్ని విడిచి కుంభకోణాలు చేపట్టింది. నాటి తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో మరోసారి సింగరేణి పరిరక్షణకు కార్మిక లోకం ముందుకు నడువాలి.
– కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే
రెండున్నరేళ్లలో ఆగం
నాడు సిరులు కురిపించిన సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి కుంభకోణాలతో నిర్వీర్యం చేస్తున్నది. అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల్లలోనే ఆగంపట్టించింది. మనుగడ ప్రశ్నార్థకం చేసింది. కార్మికులకు డిపెండెంట్ లేదు, మెడికల్ బోర్డు లేదు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ వారసత్వం కల్పిస్తే.. కాంగ్రెస్ విచారణ పేరిట కుట్రలు చేస్తున్నది. 32శాతం వరకు కార్మికులకు లాభాల వాటాను కేసీఆర్ ప్రకటించగా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 16శాతం వాటా ఇచ్చి బయటికి మాత్రం 33శాతంగా ప్రకటించడం శోచనీయం. రూ.4,500కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో చెప్పాలి.
– కొప్పుల ఈశ్వర్, టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు
ఇచ్చిన హామీలు అమలు చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ప్రజలను నిండా ముంచింది. అందులో తులం బంగారం ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించింది. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారు. అనేక కార్యక్రమాలు చేపట్టి ఏ లోటూ లేకుండా చేశారు. కాంగ్రెస్ వచ్చి సంతోషాన్ని ఆవిరి చేసింది. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
– గంగుల కమలాకర్, మాజీ మంత్రి
అడ్డుకోవడం సరికాదు
పదేండ్లు సీఎంగా ఉండాలనుకుంటున్న రేవంత్‌రెడ్డి కొడంగల్‌లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి చూపించాలి. ఓట్లు వేసిన ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచి రెండున్నరేండ్లుగా ప్రతి సభలో కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకుంటున్నడు. రామగుండం సీఎస్పీలో బొగ్గు నిల్వల పరిశీలనకు వెళ్తుంటే పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించి అడ్డుకోవడం సరికాదు. సమయం వచ్చినప్పుడు పోలీసులకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం.
– పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే