తెలంగాణచౌక్, ఆగస్టు 1: నిరంకుశ పాలన తమకొద్దని, స్పెషల్ డ్రైవ్ పేరుతో ఆటోడ్రైవర్లపై ట్రాఫిక్, ఆర్టీవో అధికారులు చేస్తున్న వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ పబ్లిక్, ప్రైవేట్ రోడ్డు ట్రాన్స్పోర్డు వర్కర్స్ యూనియన్ నాయకులు నిరసనకు దిగారు. ఆ యూనియన్ (సీఐటీయూ) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ చౌక్ వద్ద ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు స్కీంతో ఆటో డ్రైవర్లకు ఉపాధి లేకుండా పోయిందని, రోజు 200 కూడా ఆదాయం రాక కుంటుంబ పోషణ భారంగా మారిపోయిందని చెప్పారు. అసలే కిరాయిలు లేక ఇబ్బందులు పడుతున్న ఆటో డ్రైవర్లను టాప్ నెంబర్ లేదని, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ లేదని ట్రాఫిక్, ఆర్టీవో అధికారులు స్పెషల్ డ్రైవ్ పేరుతో తమను వేధిస్తున్నారని వాపోయారు.
తాము ఫ్రీ బస్సు స్కీంకు వ్యతిరేకం కాదని, ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఇన్సూరెన్స్, ఫిట్నెట్ ప్రభుత్వమే భరించాలని కోరారు. 12 వేల సాయం చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాన్ని సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయారని, అసలు ఆ విషయాన్నే ప్రస్తావించడంలేదని మండిపడ్డారు. బతుకు భారమై ఇప్పటివరకు 100 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు పాల్పడ్డారని, కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
అంతకుముందు నిరసన తెలిపేందుకు సిద్ధపడుతున్న ఆటో డ్రైవర్లను పోలీసులు అడ్డుకోగా, వారి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇదేం నిరంకుశపాలన అని, నిరసనను అడ్డుకోవడం తమ హక్కులను హరించడమేనని ఆటో డ్రైవర్లు మండిడ్డారు. పోలీసుల ఒత్తిడితో బ్యానర్లు లేకుండానే నిరసన తెలిపారు. ఇక్కడ యూనియన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నాయకులు రమేశ్, వెంకటేష్, సంపత్ పాల్గొన్నారు.