women workers | కోల్ సిటీ, జూలై 8: రామగుండం నగర పాలక సంస్థ పారిశుధ్య విభాగంలో పని చేస్తున్న మహిళా కార్మికులను సూటిపోటీ మాటలతో వేధిస్తున్న సూపర్వైజర్లను వెంటనే సస్పెండ్ చేయాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షుడు మద్దెల దినేష్ డిమాండ్ చేశారు. మహిళా కార్మికులతో కలిసి కార్యాలయం ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. ‘ఆ వేధింపులు భరించలేకపోతున్నాం… మాకు భద్రత కల్పించండి..’ అంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలోని పాత 50 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరణ చేసే రిక్షా, ట్రాలీ కార్మికులు 118 మంది వరకు ఉన్నారని, కార్మికుల సంఖ్య తక్కువ ఉండటం వల్ల వారిపై పనిభారం పెరిగి అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కార్పొరేషన్ పరిధి పెంచినందున పని విస్తరణ కూడా పెరుగుతుందని, కార్మికుల సంఖ్య తక్కువ ఉండటం వల్ల పని భారం పడుతుందని అన్నారు.
ప్రస్తుతం ఇస్తున్న జీతాలు అతి తక్కువగా ఉండటం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. రిక్షా కార్మికులను ఔట్ సోర్సింగ్ కార్మికులుగా గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలన్నారు. మహిళా కార్మికులను వేధిస్తున్న సూపర్వైజర్లను వెంటనే విధుల్లో నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
కొంతమంది సూపర్వైజర్లు మహిళలను కించపరిచే విధంగా నిత్యం సూటిపోటి మాటలతో విధి నిర్వహణలో అనేక వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, కమిషనర్ అరుణ శ్రీ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా కార్మికులు పాల్గొన్నారు.