ఇల్లంతకుంట/ముస్తాబాద్/చందుర్తి/ వేములవా డ రూరల్, జూన్ 1: జిల్లా వ్యాప్తంగా శనివారం హనుమాన్ పెద్ద జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ ఆలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. ఈ సందర్భంగా ఆలయాల ప్రాంగణాల్లో జైబోలో హనుమాన్ కీ జై.. అంటూ నినదించారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఇల్లంతకుంట మండ లం పొత్తూరులో భక్తులు అన్నదానం చేశారు. అలాగే మండల కేంద్రంలోని గంగాధర క్షేత్రంలో కల్యాణోత్సవం, ప్రత్యేక పూజలు చేశారు.
ముస్తాబాద్ మండ లం మద్దికుంటలో నిర్వహించిన కుంకుమార్చనలో మహిళలు మంగళహారతులతో హాజరయ్యారు. ఎంపీపీ జనగామ శరత్‌రావు కుటుంబ సభ్యులు భక్తులకు అన్నదానం చేశారు. అలాగే చందుర్తి మండలం మల్యాలలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. వేములవాడ మండలం అగ్రహారం హనుమాన్ ఆలయంతోపాటు లింగంపల్లి, తదితర గ్రామాల్లోని ఆలయాల్లో ఉదయం నుంచే ప్రత్యేక పూజలు చేశారు. లింగంపల్లి గ్రామంలో నిర్వహించిన వేడుకలకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్‌రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు.