Kondagattu |కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి నాలుగు రోజులపాటు హన్మాన్ చిన్న జయంత్యుత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 6న హన్మాన్ చిన్న జయంతి నేపథ్యంలో నాలుగు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలు ఈ నెల 7న ముగియనున్నాయి. చిన్న జయంతికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలిరానుండగా, ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
– మల్యాల, ఏప్రిల్3
మల్యాల, ఏప్రిల్ 3: దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంజనేయ స్వామికి రెండు జయంతులు నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున హన్మాన్ చిన్న జయంతిని, వైశాఖ బహుళ దశమి రోజున హన్మాన్ పెద్ద జయంతిని నిర్వహిస్తారు. చైత్ర పౌర్ణమి రోజున ఉత్తర భారత దేశంతో పాటు దక్షిణ భారత దేశంలో ఆంజనేయ స్వామి వారి జయంతిని నిర్వహిస్తుండగా, కొండగట్టులో స్వామి వారికి చిన్న హనుమాన్ జయంతిగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ఎలాంటి ప్రత్యేక ఉత్సవాలు, యజ్ఞయాగాదులు నిర్వహించకుండా కేవలం అభిషేకం, అర్చనలు మాత్రమే నిర్వహిస్తారు. శ్రీచాత్తాద శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం జయంత్యుత్సవాలను ఆలయ అర్చకులు నిర్వహిస్తారు.
స్వామి వారి తిరునక్షత్రం రోజయిన వైశాఖ బహుళ దశమిని ప్రధాన ఉత్సవంగా పేర్కొంటూ ఆలయంలో త్రయాహ్నిక త్రికుండాత్మక యజ్ఞం జరిపి జయంతి రోజున పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిస్తారు. హన్మాన్ చిన్న జయంతి తర్వాత సరిగ్గా మండల(41)రోజుల తర్వాత పెద్ద జయంతిని నిర్వహిస్తారు. చిన్న జయంతి సందర్భంగా భక్తులు అత్యంత కఠిన నియమాలతో స్వీకరించిన మండల, అర్ధమండల దీక్షలు, ఏకాదశ దీక్షలు, 5రోజుల దీక్షలను కొండగట్టులో స్వామి సన్నిధిలో విరమణ చేసి స్వామికి మొక్కులు చెల్లించుకుని తిరిగి వెళ్లారు. లక్షలాది మంది దీక్షాపరులు, భక్తులు తరలివచ్చే అంజన్న జయంతి ఉత్సవాలకు ఆలయ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం తెలిపారు.
ప్రత్యేక ఏర్పాట్లు
ఎండకాలం కావడంతో భక్తులు ఇబ్బంది పడకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానాలయం ఆవరణతోపాటు పరిసరాలు, బస్టాండ్ ఎదుట ఖాళీ స్థలం, 20 గదుల ధర్మశాల, లడ్డూ పులిహోర విక్రయ కేంద్రాలు, టికెట్ విక్రయ కేంద్రాల వద్ద చలువ పందిళ్లు వేయించారు. ప్రత్యేక క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. మాల విరమణ మండపం వద్ద ఆరు సెల్లార్లు నిర్మించారు. జయంతికి వచ్చే వీఐపీల దర్శనం కోసం ఆలయ వెనుక ద్వారం నుంచి ప్రత్యేక క్యూ లైను నిర్మించారు. వీటితో పాటు ఆలయానికి విద్యుత్ దీపాలు, ఆలయ ఆవరణలో లైటింగ్, సౌండ్ సిస్టం, ఎమర్జెన్సీ వినియోగానికి 10 జనరేటర్లను సైతం సిద్ధంగా ఉంచారు. 30 ప్రాంతాల్లో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా ఈ సారి శుద్ధిచేసిన జలాలతో ఆటోల్లో 5 మొబైల్ చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.
76 శాశ్వత ప్రాతిపదికన ఉండగా మరో 58 తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. పారిశుధ్య నిర్వహణకు జగిత్యాల డీపీవో అదనపు సిబ్బందిని కేటాయించారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో వైద్య శిబిరాలను ఏర్పాటుచేశారు. నూతన పుష్కరిణి వద్ద మహిళా భక్తులు దుస్తులు మార్చుకునేందుకుగాను గదులను నిర్మించారు. భక్తులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటరును ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు వచ్చే దీక్షాపరులు, భక్తుల కోసం ముందస్తుగానే 3 లక్షల లడ్డూలను తయారుచేసి పెట్టారు. సరిపోకుంటే వెంటనే తయారుచేసేలా అదనపు సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచినట్లు ప్రసాద తయారీ ఇన్చార్జి సునీల్, ధర్మేంధర్లు తెలిపారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా అప్పటికప్పుడే పులిహోరను తయారుచేసి భక్తులకు అందిస్తామని వారు తెలిపారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, ఏఈవో బుద్ది శ్రీనివాస్, ఏఈ లక్ష్మణ్‌రావు, సీఐ రమణమూర్తి, ఎస్ఐలు మంద చిరంజీవి, కొడిమ్యాల ఎస్ఐ వెంకట్రావ్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
లక్షలాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 104 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. దేవాలయం తరపున ఆలయంలోపల, ఆలయానికి వెలుపల అమర్చిన 64 సీసీ కెమెరాలకు అదనంగా 40 సీసీ కెమెరాలను అద్దె ప్రాతిపదికన అమర్చారు. పోలీస్ ఔట్ పోస్టులో కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి, 104 సీసీ కెమెరాలను నూతనంగా నిర్మించిన కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. ఎస్పీ ఎగ్గడి భాస్కర్ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సోమవారం పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి, సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. 1500 మంది పోలీస్ బలగాలతో ప్రత్యేక బందోబస్తుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. నూతనంగా ఆలయ పరిధిలో పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద సెంట్రలైజ్డ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ఉత్సవాలను పర్యవేక్షించనున్నారు.
ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. నీటి సమస్య లేకుండా గుట్ట మీద ఉన్న 4లక్షల నీటి ట్యాంకును నింపి సిద్ధంగా ఉంచాం. ఈ ట్యాంకు నుంచి నూతన పుష్కరిణి, ఆలయంలోని ఇతర ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తాం. కొత్త పుష్కరిణిని శుభ్రం చేయించి నేడు నీటిని నింపుతాం. సీసీ కెమెరాల ద్వారా సమస్యను గుర్తించి పరిష్కరిస్తాం. చలివేంద్రాల్లో ట్యాంకర్ల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని సరఫాచేస్తాం. పాలకవర్గ సహకారంతో పాటూ పోలీసులు సూచించిన ప్రకారం కొండపైన సెల్‌సిగ్నల్ సరిగా లేనందున ఉత్సవాలకు వచ్చే ఉద్యోగులకు ఎప్పటికప్పుడు సూచనలు చేసేందుకు ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో వైర్లెస్ సెట్ సేవలను ఈ సారి అందుబాటులోకి తెచ్చాం.
– టంకశాల వెంకటేశ్, ఆలయ ఈవో
ఆలయానికి మరింత శోభ
భక్తుల కోసం ఈ సారి ప్రధాన రహదారుల వెంబడి ప్రత్యేకంగా నడక మార్గాలను ఏర్పాటు చేసేందుకు రాజారాం నుంచి కొండగట్టు దిగువ వరకు ఏర్పాట్లు పూర్తి చేశాం. ఆలయంలో జరిగే ప్రతీ ఉత్సవం, సేవలు అందరికి తెలిసేలా స్వాగత తోరణాలను ఏర్పాటు చేశాం. ఆలయ శోభ మరింత ఉట్టిపడేలా ఏర్పాట్లు చేస్తున్నా. దీక్షాపరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నాం.
– తిరుక్కోవెల మారుతీస్వామీ, ఆలయ పాలక మండలి చైర్మన్