పంటలు చేతికొచ్చిన దశలో అకాల వర్షం ముంచింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శుక్రవారం అకాల వాన దంచికొట్టింది. సాయంత్రం భారీగా గాలులు వీస్తూ ఉరుములు మెరుపులతో కురిసింది. అక్కడక్కడా రాళ్ల వాన పడింది. దీంతో చేతికొచ్చిన వరి, మక్క పంటలతోపాటు మామిడి తోటలకు తీరని నష్టం
వాటిల్లింది. అసలే సాగునీరు లేక అకష్టకష్టాలు పడుతున్న రైతన్నపై ఈ వాన మరింత ప్రభావం చూపింది.
కరీంనగర్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : అకాల వాన అన్నదాతను హడలెత్తించింది. శుక్రవారం సాయంత్రం తర్వాత బెంబేలెత్తించింది. ఈదురుగాలుకు తోడు రాళ్లవాన దంచికొట్టింది. పెద్దపల్లి మండలంతోపాటు ధర్మారం, రామగిరి, సుల్తానాబాద్, మంథని ఓదెల మండలాల్లోని పలు గ్రామాల్లో సైతం భారీ వర్షం పడింది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, రామడుగు, చొప్పదండి మండలాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. దాదాపు జిల్లా అంతట చిరుజల్లులు పడగా, చొప్పదండి మార్కెట్లో ధాన్యం తడిసి ముద్దయింది.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి, వేములవాడ, కోనరావుపేట, రుద్రంగి మండలాల్లో గంటపాటు భారీ వర్షం కురిసింది. ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. భారీ వర్షంతో కోతకు వచ్చిన వరి నేలపాలై రైతుకు నష్టం చేసింది. కొన్ని మండలాల్లో రైతులు ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలకేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడిజిల్లాలో పలు చోట్ల 40 నిమిషాల పాటు రాళ్లతో వర్షం కురవడంతో రైతులు ఒకసారిగా ఉలికిపడ్డారు. పొట్ట దశలో వరిపై రాళ్లవాన కురవడం రైతులను తీవ్రంగా కలిచివేసింది. మామిడి పూత కాత రాలి భారీ నష్టాన్ని కలిగించింది. రేపు ఎల్లుండి సైతం జిల్లాలో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
కమాన్చౌరస్తా/ ముకరంపుర మార్చి 21: అకాల వర్షంతో అక్కడక్కడా అంధకారం అలుముకున్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు విద్యుత్ సరఫరాలో తరుచూ అంతరాయం కలిగింది. దుర్శేడ్లోని 220కేవీ సబ్స్టేషన్లో టెక్నికల్ సమస్యతో వావిలాలపల్లె, వాటర్ వర్స్, పద్మనగర్ 133కేవీ సబ్ స్టేషన్లకు సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రభావంతో నగరంలోని అన్ని 33/11కేవీ సబ్స్టేషన్లతోపాటు సమీప మండలాలకు సరఫరా ఆగిపోయింది. దీంతో నగరంలో అరగంటకుపైగా అంధకారం నెలకొన్నది. సరఫరాను తిరిగి పునరుద్ధరించినా కరెంట్ వస్తూ పోతూ ఉండడంతో తీవ్ర అవస్థ పడ్డారు. ప్రధానంగా పదో తరగతి విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. పరీక్షల వేళ కరెంట్ కావడంతో కొందరు సెల్ఫోన్ లైట్ల వెలుగులో, మరికొందరు కార్లలో లైట్లు వేసుకొని చదువుకున్నారు.