Bengaluru Video : బెంగళూరులో దారుణం జరిగింది. రోడ్డుపై కానిస్టేబుల్ ఒక బైకుమీద పిల్లలతో ఆగిఉండగా.. వారిపైకి స్కూల్ బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మరణించారు. ఈ ఘటన నార్త్ బెంగళూరులోని తానిసండ్ర ప్రాంతంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో జరిగింది. మృతులు భాను (4), వర్ష (2)గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా కానిస్టేబుల్‌గా పని చేసే నగనగౌడ అనే వ్యక్తి ఉదయం పాల ప్యాకెట్ కోసం ఇంటినుంచి బైకుపై బయటకు వచ్చాడు. తనతోపాటు కూతురు వర్షను, అన్న కూతురు భానును బైకుపై ఎక్కించుకుని వెళ్లాడు. మూల మలుపు వద్ద పిల్లలిద్దరితో కలిసి బైకుపై ఆగిఉన్నాడు. అదే సమయంలో అక్కడికి ఒక స్కూల్ బస్సు వేగంగా వచ్చి టర్న్ తీసుకుంది. రోడ్డుపై ఉన్న వీరిని గమనించకుండా డ్రైవర్ నిర్లక్ష్యంగా స్కూల్ బస్సు నడిపాడు. దీంతో బైకు పక్కకు పడిపోగా, చిన్నారులిద్దరూ బస్సు టైర్ల కింద పడిపోయారు. నగనగౌడ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. టైర్ల కింద పడ్డ చిన్నారులు వర్ష, భాను తీవ్రంగా గాయపడ్డారు.
Horrific incident from Bengaluru. Two children, 2-yr-old Varsha & 4 yr-old Bhanu killed as a school bus runs over them. The father was headed to buy milk with the kids when the school bus that was turning rams into the bike & ran over the kids, killing them on the spot. pic.twitter.com/lApeCPTNVO
— Deepak Bopanna (@dpkBopanna) February 11, 2026
వెంటనే వారిని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఈ ఘటనకు బాధ్యుడైన స్కూల్ బస్సు డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాల్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డుకాగా.. ఆ వీడియో వైరల్ అవుతోంది.