MK Stalin : తమిళనాడులో తమ డీఎంకే పార్టీ ఒంటరిగానే పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. అయినప్పటికీ తమ పార్టీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుందని స్పష్టం చేశారు. తమిళనాడు, చెన్నైలో బుధవారం ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ స్టాలిన్ ఈ విషయాలు వెల్లడించారు. మరో రెండు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, డీఎంకే పొత్తు ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ‘‘వచ్చే ఎన్నికల్లో డీఎంకే ఒంటరిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. ఇంకా చెప్పాలంటే 2021కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో సోదరుడిలాంటి అనుబంధం ఉంది. డీఎంకే-కాంగ్రెస్ మధ్య పొత్తు బలంగా ఉంది. ఆ పార్టీతోనే కలిసి ఎన్నికలకు వెళ్తాం. అయితే, ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ భాగమవుతుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. ఎన్డీయే ప్రభుత్వం తప్పుడు వాగ్దానాలు, ద్వేషం, మత ఘర్షణలతో నడుస్తోంది. ఎన్డీయే పాలన డబుల్ ఇంజిన్ కాదు. డబ్బా ఇంజిన్. అదో ఖాళీ ఓడ. ఈ ఎన్నికలు ఆర్యులకు, ద్రవిడులకు మధ్య యుద్ధం లాంటివి’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాలకు వచ్చే వేసవిలో ఎన్నికలు జరుగుతాయి. అధికార డీఎంకేతోపాటు, విజయ్ స్థాపించిన టీవీకే, ఏఐఏడీఎంకే, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 133 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్, డీఎంకేల మధ్య ఈ నెల 22 నుంచి సీట్ల పంపకాలపై చర్చలు జరగనున్నాయి. ఈ అంశంపై గత నెలలో తమిళనాడు ఎంపీ కనిమొళి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఇప్పటికే చర్చించారు.