మానకొండూరు రూరల్, మార్చి 13 : దేశంలో బలహీనమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) అని, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియడంలేదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మనకొండూర్ మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో మార్చురికి పోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి దుర్యోధనుడిగా వ్యవహరిస్తున్నారనీ, తుపాకి రాముడు అనే బిరుదును రేవంత్ రెడ్డికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామన్నారు.
కేసీఆర్, కేటీఆర్, ఫ్యామిలీని తిట్టుడు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యాలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని, లేనట్లయితే సీఎం రేవంత్ రెడ్డిని కరీంనగర్లో ఏ సభ పెట్టినా అడ్డుకుంటామని హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో సాగునీటి కోసం రైతులు ధర్నా చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపేందుకు వెళ్లిన వారిని పోలీసులు క్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. వారిని వెంటనే భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు తాళ్ల పెళ్లి శేఖర్ గౌడ్, మానకొండూరు సొసైటీ ఉపాధ్యక్షుడు పంజాల శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ రామంచ గోపాల్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పిట్టల మధు, నాయకులు శాతరాజు యాదగిరి, తదితరులు ఉన్నారు.