GST | కరీంనగర్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేశ వ్యాప్తంగా వస్తువుల తయారీ, అమ్మకం (అవుట్‌పుట్, ఇన్పుట్) వంటి వాటిపై వినియోగించేదే వస్తు సేవల పన్ను (గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్- జీఎస్టీ). ట్రేడర్స్, రిటైలర్స్, కాంట్రాక్టర్స్ ఇలా విభిన్న వర్గాలు జీఎస్టీ రూపంలో కేంద్రానికి, రాష్ర్టానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. జీఎస్టీ పలు రకాలుగా ఉన్నది. ఒక వస్తువుపై 24 శాతం జీఎస్టీ ఉంటే.. మరొకదానిపై 5 శాతం ఉన్నది. ఇలా అనేక స్లాబ్‌లు ఉన్నాయి. నిబంధనలకు లోబడి సంబంధిత వ్యాపార వర్గాలు జీఎస్టీ చెల్లించాలి.
అందుకోసం ముందుగా ఒక ఫర్మ్ ఓపెన్ చేసుకొని, సదరు ఫర్మ్‌పై చేసే క్రయవిక్రయాలకు అనుగుణంగా చెల్లింపులు చేయాలి. అయితే ప్రభుత్వానికి రూ.లక్షల్లో జీఎస్టీ ఎందుకు చెల్లించాలన్న దురుద్దేశంతో జగిత్యాల కేంద్రంలో కొంత మంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, విభిన్న వర్గాలు అడ్డదారులు తొక్కి, టాక్సు ఇన్వాయిస్లు సృష్టించి దందా నడిపినట్టు తెలుస్తున్నది. వాటి ద్వారా జీఎస్టీ చెల్లింపులు చేయకుండా ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టగా, దీని విలువ దాదాపు రూ.200 కోట్ల పై మాటే ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా తెలుస్తున్నది.
జగిత్యాలకు చెందిన ఓ ఆడిటర్ వద్ద గతంలో అసిస్టెంట్‌గా పనిచేసిన ఒక వ్యక్తి ఈ దందాలో కీలక భూమిక పోషించాడు. ఆయనతోపాటు మరికొంత మంది కలిసి ఈ దందా నడిపినట్టు తెలుస్తున్నది. సదరు అసిస్టెంట్ ఆ ఆడిటర్ దగ్గరి నుంచి వెళ్లిపోయే సమయంలో క్లోజింగ్ చేయాలని ఇచ్చిన ఫర్మ్‌ల డాటా తీసుకెళ్లి.. సదరు ఫర్మ్‌ల పేరిట ఈ దందా సాగించినట్టు తెలుస్తున్నది. జగిత్యాలలోని ఒక ఎలక్ట్రికల్ ట్రేడర్‌కు సంబంధించి ఆయనకు తెలియకుండానే.. అతని పాత ఫర్మ్ పేరిట బోగస్ టాక్స్ ఇన్వాయిలు సృష్టించిన వ్యవహారంతో ఈ బాగోతం బయటపడినట్టుగా సమాచారం.
సదరు ట్రేడర్ పేరిట భారీ మొత్తంలో టాక్స్ ఇన్వాయిస్లు వచ్చిన విషయాన్ని గుర్తించిన జీఎస్టీ అధికారులు, వాటిని ఆధారంగా చేసుకొని చెల్లించాల్సిన జీఎస్టీపై సదరు ట్రేడర్ వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే.. అతను చెప్పిన విషయాలు విని అధికారులే విస్మయానికి గురైనట్లుగా సమాచారం. తన పాత ఫర్మ్‌ను గతంలోనే క్లోజ్ చేయాలని ఆడిటర్‌కు చెప్పానని, సదరు ఫర్మ్ పేరిట ఎటువంటి క్రయవిక్రయాలు చేయలేదని, ఇదంతా తనకు తెలియకుండానే జరిగిందని, ఇవన్నీ బోగస్ టాక్స్ ఇన్వాయిస్లే అని చెప్పడంతో అధికారులు నిర్ఘాంత పోయినట్టు సమాచారం.
జీఎస్టీ బాగోతంలో లోతుగా విచారణ చేస్తే.. తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా సమాచారం. భారీ మొత్తంలో బోగస్ టాక్స్ ఇన్వాయిస్లు సృష్టించి చాలా మంది జీఎస్టీ ఎగవేతకు పాల్పడిన విషయం బహిర్గతం అయినట్లుగా తెలుస్తున్నది. ఇది కేవలం ఒక్క జగిత్యాల జిల్లాకు మాత్రమే పరిమితం కాలేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ బాగోతం ఉమ్మడి జిల్లాలో ఒక చైన్ లింకులా నడిచిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
బోగస్ ఇన్వాయిస్లు సృష్టించిన వ్యక్తులు.. సదరు ట్రేడర్స్, కాంట్రాక్టర్ల నుంచి భారీ మొత్తమే వసూలు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ దందా బహిర్గతం కావడంతో సదరు అక్రమార్కుల్లో వణుకు మొదలైంది. మరోవైపు ఈ వ్యవహారంలో ఏ అధికారి పాత్రైనా ఉన్నదా..? వారి పాత్ర లేకుండా ఇంత పెద్ద మొత్తంలో బోగస్ వాయిస్‌లు సృష్టించి జీఎస్టీ ఎగవేతకు ప్రయత్నించడం సాధ్యమేనా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా జీఎస్టీ చెల్లింపుల్లో ఒడిదొడుకులున్నప్పుడు ఆయా ట్రేడర్స్‌కు సంబంధించి ఆడిటర్స్ ఇచ్చిన వివరాలను పరిశీలించి జీఎస్టీ అధికారులు అందుకు అనుగుణమైన చర్యలు తీసుకుంటారు. ఆడిటర్స్ ఇచ్చిన వివరాల్లో ఏమైనా లోటు పాట్లు ఉంటే.. ఆ విషయాన్ని వివరిస్తూ.. ట్రేడర్స్ చెల్లించాల్సిన జీఎస్టీ ఏమైనా ఉంటే నోటీసులు ఇచ్చి పేమెంట్ చేయిస్తారు. ఇది రొటీన్‌గా జరిగే పద్ధతి. కానీ, జగిత్యాలలో వెలుగు చూసిన వ్యవహారం దీనికి పూర్తి విరుద్ధం.
ఎటువంటి క్రయ విక్రయాలు లేకుండా.. పలు ఫర్మ్‌ల పేరిట బోగస్ టాక్స్ ఇన్వాయిస్లు సృష్టించి.. పెద్ద మొత్తంలో జీఎస్టీ చెల్లింపునకు ఎగనామం పెట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. దీనిని సీరియస్ తీసున్న జీఎస్టీ అధికారులు.. గడిచిన రెండు రోజులుగా విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. ఇప్పటికే పలు ఆధారాలు సేకరించి, మరింత లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఎన్ఫోర్స్మెంట్ను రంగంలోకి దింపిన అధికారులు.. పూర్తి వివరాలు లాగుతున్నారని తెలుస్తున్నది.
బోగస్ టాక్సు ఇన్వాయిస్ అంశంపై ‘నమస్తే తెలంగాణ’ ఇన్చార్జి.. జేసీకి ఫోన్ చేసి వివరణ కోరగా, ఈ వ్యవహారంపై విచారణ చేస్తున్నామని చెప్పారు. తమ పరిశీలనలో భాగంగా కొన్ని విషయాలను గుర్తించామన్నారు. ఇంకా పూర్తి విరాలు తేలలేదని, ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పారు. కాగా, ఇదంతా రొటీన్‌గా జరిగే తనిఖీల్లో భాగంగానే తమ విచారణ సాగుతుందని తెలిపారు. విచారణ పూర్తయ్యాక వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.
– సీహెచ్ రవికుమార్, కరీంనగర్ జీఎస్టీ ఇన్చార్జి జాయింట్ కమిషనర్