Balamrut | కరీంనగర్ కలెక్టరేట్, ఏప్రిల్ 19 : అనేక పోషకాలు కలిగిన బాలామృతంతోనే బాలల్లో ఎదుగుదల ఉంటుందని, అంగన్వాడీ అర్బన్ సూపర్వైజర్ ఎం స్వప్న అన్నారు. పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా మెప్మా, ఐసీడీఎస్ సంయుక్తంగా నగరంలోని సంతోష నగర్ సెక్టార్ పరిధిలో గల మార్కండేయనగర్ అంగన్వాడీ కేంద్రంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా సూపర్ వైజర్ స్వప్న మాట్లాడుతూ, పోషణ్ పక్వాడా కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో విధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లల ఎదుగుదలకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకునే క్రమంలో ఎత్తు, వయసుకు తగ్గ బరువు, తీసుకునే ఆహారంలో చేర్చాల్సిన పోషకాలపై తల్లులకు అవగాహన కల్పించారు. పోషణ లోపాలు అధిగమించేందుకు బాలామృతం పిల్లలకు క్రమం తప్పకుండా అందించాలన్నారు. గర్భిణీలు సాధారణ ప్రసవాలకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. నవజాత శిశువులకు పుట్టిన గంటలోపే ముర్రుపాలు తాగించాలని, తద్వారా వారిలో రోగనిరోధక శక్తిని పెంపొందించినవారవుతారని అన్నారు.
ఆరోగ్యాన్ని పరిరక్షించుకునే క్రమంలో మిల్లెట్ పుడ్‌ను భుజించాలని, నిత్యం వ్యాయామం చేయటం ద్వారా అనారోగ్య లక్షణాలు దూరమవుతాయన్నారు. అలాగే, ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న సెల్‌ఫోన్ భూతం, సోషల్ మీడియా మాధ్యమాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలన్నారు. కార్యక్రమంలో మెప్మా సీవో రమణ, అంగన్వాడీ టీచర్ రమణ, మహిళా సంఘాల సభ్యులు, చిన్నారుల తల్లులు, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.