గ్రూప్-1 ప్రిలిమినరీ టెస్ట్‌కు వేళయింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పరీక్షకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 87 ఎగ్జామ్ సెంటర్లలో 37,152 మంది అభ్యర్థులు పరీక్ష రాయనుండగా, యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 8: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో 37,152 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానుండగా, 87 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలో 36 సెంటర్లలో 18,663 మంది, పెద్దపల్లి జిల్లాలో 14 కేంద్రాల్లో, 6098 మంది, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 15 కేంద్రాల్లో 4699 మంది, జగిత్యాల జిల్లాలో 22 కేంద్రాల్లో 7,692 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగనుండగా, కేంద్రాల్లో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా చర్యలు తీసుకున్నారు. వేసవి దృష్ట్యా అన్ని కేంద్రాల్లో అభ్యర్థులకు తాగునీటి వసతితో పాటు, ప్యాన్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేందుకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు కూడా బిగించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు ఇప్పటికే పరీక్ష విధులు నిర్వహించనున్న అధికారులతో సమీక్షలు చేపట్టారు.
అభ్యర్థులు తాము పరీక్ష రాయబోతున్న కేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచే లోనికి అనుమతించనున్నారు. అనంతరం బయోమెట్రిక్ తీసుకోనున్నారు. బయోమెట్రిక్ వేస్తేనే వారి ఓఎంఆర్ షీట్ల మూల్యాంకనం జరుగుతుందని టీజీపీఎస్సీ విడుదల చేసిన గైడ్‌లైన్స్ స్పష్టం చేస్తుండగా.. అభ్యర్థులు విధిగా బయోమెట్రిక్ వేయాలని చెబుతున్నారు. పది గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేయనున్నారు. అనంతరం వచ్చే అభ్యర్థులను ఎట్టి పరిస్థితుల్లో కూడా లోనికి అనుమతించేది లేదని స్పష్టం చేస్తున్నారు.
అభ్యర్థులు బయోమెట్రిక్ వేయాల్సి ఉన్న నేపథ్యంలో చేతులకు ఎలాంటి మెహిందీ గానీ, గోళ్లకు నెయిల్ పాలిష్ గానీ వేయకూడదని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎప్పటిమాదిరిగానే ఈ సారి కూడా ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ, సెల్ఫోన్లు గానీ, ఎలాంటి బంగారపు ఆభరణాలు కానీ ధరించకూడదనే నిబంధన అమలులో ఉన్నది. అలాగే, అభ్యర్థులు బూట్లు వేసుకోకుండా సాధారణ చెప్పులు మాత్రమే ధరించి పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తప్పనిసరి తమ వెంట ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపుకార్డు తెచ్చుకోవాలి. ఓటర్, ఆధార్, ఎంప్లాయ్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు లాంటివి కూడా తీసుకురావచ్చు. వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌పై ఇటీవల దిగిన పాస్‌పోర్టు సైజు ఫోటో మాత్రమే అతికించాల్సి ఉంటుంది. హాల్‌టికెట్‌పై అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే చెల్లుబాటవుతుంది. పరీక్ష కేంద్రాల పరిసరాల్లో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని, ఒకరికన్నా ఎక్కువ మంది ఆయా ప్రాంతాల్లో సంచరిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే, అభ్యర్థులను పరీక్ష కేంద్రాలకు చేర్చేందుకు అవసరమైన రవాణా వసతులు కూడా కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశిస్తున్నట్లు అధికారులు చెప్పారు.